Cyclone Effect : ఏపీకి రెడ్ అలెర్ట్.. భారీ వర్షాలు.. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్

ఫెంగల్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను వదలిపెట్టలేదు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముంది;

Update: 2024-11-30 03:58 GMT

ఫెంగల్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను వదలిపెట్టలేదు. నిన్న తుపాను ముప్ప తప్పిందని భావించినప్పటికీ తీవ్రవాయుగుండం తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తమిళనాడులో పన్నెండు జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని, అక్కడ రెడ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు. ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టింది.

తీరం దాటే సమయంలో...
ఫెంగల్ తుపాను ఈరోజు మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం తీరం దాటే అవకాశముందనిచెప్పారు. ఫెంగల్ తుపాను మహాబలిపురం - కారికలై మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే చెన్నెతో పాటు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే తమిళనాడులోని పన్నెండు జిల్లాల్లో, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో మెట్రో పార్కింగ్ ను కూడా అధికారులు మూసివేయించారు. నాగపట్నం, కడలూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
ఈ నాలుగు జిల్లాకు భారీ వర్షం...
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు రెండు రోజుల పాటు వెళ్లవద్దని సూచించారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయని తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు, నదులు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఫ్లాష్ ఫ్లెడ్స్ వచ్చే అవకాశముందని చెప్పారు. దక్షిణ కోస్తాలోని పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


Tags:    

Similar News