Ramana Deekshitulu : నిత్యం వివాదాల్లో తిరుగాడే రమణదీక్షితులు ఆధిపత్యం కోసమేనా?

తిరుమలలో కొన్నేళ్ల పాటు ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు కూడా ఎప్పటికప్పుడు తన వాయిస్ ను మారుస్తున్నారు.

Update: 2024-09-20 07:57 GMT

ramana dikshitulu

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నేళ్ల పాటు ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు కూడా ఎప్పటికప్పుడు తన వాయిస్ ను మారుస్తున్నారు. తనకు అవకాశమిస్తే సరే. లేకుంటే మాత్రం పాలకపక్షంపై ఆయన ఆరోపణలు చేయడానికి వెనుకాడరు. తిరుమల దేవస్థానంలో తనకు జీవితాంతం అవకాశం కల్పించాలని ఆయన కోరుకుంటారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంపై రమణదీక్షితులు ఆరోపణలు చేశారు. నాడు కేంద్ర హోంమత్రి అమిత్ షాను కలిశారు. నాటి పాలకపక్షంపై ఫిర్యాదు చేశారు. తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా ఆయన ఇంటికి వచ్చి మరీ కలసి నాటి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

నిత్యం వివాదాల్లో...
ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డూ వివాదంలో కూడా ఆయన తలదూర్చారు. అయితే ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులను, అర్చకులను నియమించడం ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణదీక్షితులను కాకుండా వేణుగోపాల దీక్షితులను నియమించింది. అప్పటి నుంచి రమణదీక్షితులు తిరుమల వెంకటేశ్వరస్వామి సేవలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన మాత్రం ఎప్పుడూ అధికార పార్టీలపై మాత్రం విరుచుకుపడటం మానలేదు. ఆరోపణలు చేస్తుండటం ఆయనకు ఒక అలవాటుగా మార్చుకున్నారని, అంతా తనకే తెలిసినట్లు వ్యవహరిస్తారని తిరుమల అర్చకులు చెబుతున్నారు.
అంబానీ తిరుమల వస్తే....
రమణదీక్షితులు ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు అంబానీ కుటుంబం తిరుమలకు వస్తే గెస్ట్‌హౌస్ కు వెళ్లి మరీ కలవడం  అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేతకు, అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి ఫిర్యాదులు చేయడంతో పాటు అధికారం మారిన వెంటనే తిరిగి తిరుమలలో స్వామి వారి సేవ చేసుకోవడానికి అభ్యర్థించాలని కోరడం షరా మామూలుగా మారింది. ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండి పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి వారితో మాట్లాడటమేంటన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. అదే సమయంలో ఆయనను గతంలో అనేక వివాదాలు కూడా చుట్టుముట్టాయి.
లడ్డూ లడాయిలో...
ఇక తాజాగా రమణదీక్షితులు తిరుమల లడ్డూ వివాదంలో కూడా తలదూర్చారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై తాను గతంలో టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని రమణదీక్షితులు అంటున్నారు. మరి అంత జరుగుతున్నప్పుడు మీడియాకు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు మాత్రం రమణదీక్షితుల వద్ద సమాధానం లేదు. నిజంగా లడ్డూలో కల్తీ జరుగుతుంటే ఆనాడే వాటిని అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రమణదీక్షితులు కేవలం ఏ ఎండకా గొడుగు పట్టే రకంలా మారారని, ఆయన తిరిగి తిరుమలలో అడుగు పెట్టేందుకే ఈ ప్రభుత్వాన్ని మంచి చేసుకునేందుకే లడ్డూ లడాయిలో కాలు మోపారంటున్నారు. మొత్తం మీద రమణదీక్షితులు అంటే అందరికీ గౌరవమే. కానీ ఆయన మాత్రం నిత్యం వివాదాల్లోకి రావడం మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్త మవుతుంది.


Tags:    

Similar News