రాజధానిని మార్చుకునే అధికారముంది
రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు
రాజధానిని మార్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. రాజమండ్రిలో పాలన వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చామని తెలిపారు.
రియల్ ఎస్టేట్ కోసమే..
మేధావుల అభిప్రాయాలను పక్కన పెట్టి చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశాఖపట్నంలో అన్ని వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు. తాము అందరూ బాగుండాలని కోరుకుంటుంటే, వారు మాత్రం తమ భూముల విలువ పెరగాలని భావిస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.