Tirumala : కిటకిటలాడుతున్న తిరుమల వీధులు... క్యూలైన్ ఎంత పొడవు ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమల కొండపై ఉన్నారు.

Update: 2024-09-17 03:20 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమల కొండపై ఉన్నారు. వరస సెలవులు రావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుని తమ మొక్కులు శ్రీవారికి చెల్లించుకుంటున్నారు. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారుమోగిపోతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో దర్శనం కూడా సమయానికి జరగడం కష్టంగా మారింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. వరాహస్వామి ఆలయం వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ముందుగా వరాహస్వామిని దర్శించుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు బారులు తీరారు. మరోవైపు భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు, అన్న ప్రసాదాలను అందించేలా ఏర్పాట్లను చేసింది.

వరస రద్దీతో...
వరసగా మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. హుండీ ఆదాయం కూడా భారీగానే పెరిగింది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ బయట కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకూ విస్తరించి ఉంది. క్యూ లైన్ లో భక్తులకు మంచినీరు, అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు. ఉచిత దర్శనానికి భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో టైమ్ స్లాట్ టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం ఆరు గంటలకు పైగా పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,200 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,492 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News