Rain Alert : దూసుకొస్తున్నముప్పు.. ఏపీకి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2024-11-22 04:39 GMT

అసలే చలికాలం. ఇక వర్షం పడితే మరింత చలి తీవ్రత పెరిగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేదువార్త. ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూమహాసముద్రంలో కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది.

ఈ ప్రాంతాల్లో...
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీలో వర్షాలు పడతాయని తెలిపింది. దాదాపు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. వాయుగుండంగా మారడంతో పెద్దయెత్తున ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. గంటలకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.
రైతులు తమ ఉత్పత్తులు...
వాగులు, నదులు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు కూడా వాయుగుండం ప్రభావంతో చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. పిడుగులు పడే అవకాశమున్నందున పొలాల్లో పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అదే సమయంలో రైతులు తమ పంట ఉత్పత్తులు భారీ వర్షాలకు తడిసి పోకుండా ముందుగానే చర్యలు తీసుకుంటే మంచిదని అధికారులు తెలిపారు. వాయుగుండం శ్రీలంక వైపు పయనించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో.. ఏపీ ప్రజలారా హై అలెర్ట్ గా ఉండాల్సిందే.


Tags:    

Similar News