Andhra Pradesh : పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకరకంగా ఇది పింఛను అందుకుంటుున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వరసగా రెండు నెలలు పింఛను తీసుకోకున్నా మూడో నెల అంతా కలిపి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా కారణాల వల్ల రెండు నెలలు పింఛను మొత్తాన్ని తీసుకోకపోతే.. ఒకేసారి మూడు నెలలకు కలిపి పింఛను మొత్తాన్ని తీసుకునే వీలు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు నెలలు వరసగా...
అయితే వరసగా మూడు నెలలు వరసగా పింఛను తీసుకోకుంటే మాత్రం వారు వలస వెళ్లినట్లుగా భావించి పింఛను రద్దు చేస్తామని తెలిపింది. కొత్తగా విడుదలయిన ఈ మార్గదర్శకాలు ఈ నెల నుంచే వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటయిన కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల రూపాయలకు పెంచింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున పింఛను మొత్తాన్ని అందుకుంటున్నారు. అదే సమయంలో దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ప్రకటించింది. ఏదైనా కారణంతో ఒక నెలలో పింఛను తీసుకోకపోతే రెండో నెలలో రెండు నెలలకు కలిపి పింఛనును అందించనున్నారు.
అత్యధిక మొత్తం...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పర్చిన తొలి హామీ పింఛను మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇంటింటికి వెళ్లి పింఛను మొత్తాన్ని పంపిణీ చేయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గ్రామ, వార్డు సచివాలయం, రెవెన్యూ సిబ్బందితో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నెల ఒకటోతేదీన ఉదయం ఆరు గంటల నుంచే పింఛను పంపిణీ చేసేలా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా పింఛను మొత్తం పంపిణీ చేసే రాష్ట్రంగా ఏపీ ఖ్యాతి గడించింది. ఏ రాష్ట్రంలోనూ నెలకు పింఛను నాలుగు వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క ఏపీలోనే నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను మొత్తాన్ని పంపిణీ చేయడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు మార్పులు చేస్తుంది.