విజయసాయిపై నారాలోకేష్ కు శాంతి భర్త ఫిర్యాదు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు

Update: 2024-12-17 06:43 GMT

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ వినతి పత్రం అందచేశారు. ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ కు వచ్చిన మదన్ మోహన్... మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. తాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నానని, ఎంపి విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారన్నారు. 2


న్యాయం చేయాలంటూ...

తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించానని, ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని మదన్ మోహన్ తెలిపారు. విజయసాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలనికోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని, కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయని తెలిపారు. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మదన్ మోహన్ నారా లోకేష్ ను కోరారు.


 



Tags:    

Similar News