TDP : శభాష్ తమ్ముళ్లూ.. వెంటాడుతున్నారుగా.. సొంత వారిని కూడా వదలడం లేదుగా
టీడీపీ ఇప్పుడు గతంలో మాదిరిగా లేదు. ప్రభుత్వనిర్ణయాలను, పార్టీ తీసుకునే ఏ విషయాన్నైనా కార్యకర్తలు నిలదీస్తున్నారు
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గతంలో మాదిరిగా లేదు. అవసరమైతే ప్రభుత్వనిర్ణయాలను, పార్టీ తీసుకునే ఏ విషయాన్నైనా కార్యకర్తలు ఇట్టే నిలదీస్తున్నారు. నేతలను వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో వెంటాడుతున్నారు. వేటాడుతున్నారు. దీంతో పార్టీ అధినేత నుంచి ముఖ్యమైన నేతలు ఇప్పడు క్యాడర్ ను తొలుత సంతృప్తి పర్చిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. గతంలో టీడీపీలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. 1995 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ పెద్దగా ఆయన నిర్ణయాలపై ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్ గా మారింది.
నిలదేసేందుకు క్యాడర్...
కానీ ఇప్పుడు అలా కాదు. కాలం మారింది. తరం మారింది. నేతలను నిలదీసే రోజులొచ్చేశాయి. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలనతో తాము అనుభవించిన విషయాన్ని వారు గుర్తు చేసుకుని మరీ నేతలను, అధినాయకత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలయినా వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునే నిలదీస్తున్నారు. రెడ్ బుక్ ఏమయిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏమయ్యాయని సూటి ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనేక సభల్లోనూ ఆయన పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. తాను ఏదైనాచట్టపరంగానే చర్యలు తీసుకుంటానని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టనంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
ఆళ్ల నాని చేరికపై...
తర్వాత ఏలూరు నియోజకవర్గం నేత, మాజీ మంత్రి ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకోవడంపై కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది క్యాడర్. నియోజకవర్గంలో నేతల నుంచి కార్యకర్తల వరకూ ఆళ్లనాని తమను ఎలా ఇబ్బంది పెట్టింది వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో చంద్రబాబు ఆళ్ల నానికి కండువా కప్పాల్సిన సమయంలో చేరికను హోల్డ్ లో పెట్టారు. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకుంటే కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నాని చేరిక వాయిదా పడిందా? లేక డోర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయా? అన్నది తెలియకున్నా క్యాడర్ వత్తిడితోనే చంద్రబాబుతో పాటు పార్టీ అగ్రనాయకత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.
జోగి రమేష్ వివాదం...
తాజాగా నూజివీడులో జరిగిన ఘటన కూడా ఇదే అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ తో టీడీపీ నేతలు కలసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారింది. వెంటనే టీడీపీ సోషల్ మీడియాలో గౌతు శిరీషను, మంత్రి పార్థసారథిని ట్రోల్ చేశారు. దీంతో నారా లోకేష్ వారిద్దరి నుంచి వివరణ కోరారు. ఇద్దరూ అధినాయకత్వంతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి తప్పు జరగదంటూ గౌతు శిరీష, మంత్రి పార్థసారధి కార్యకర్తలను వేడుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ అధినాయకత్వంతో పాటు నేతలకు కూడా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నాక్యాడర్ అనుమతి తప్పనిసరిఅయింది. గతంలో మాదిరిగా రాజకీయాలు చేస్తామంటే కుదరదని తమ్ముళ్లు తెగేసిచెబుతున్నారు. అందుకే నేతల నిర్ణయాలను ఒళ్లు దగ్గరపెట్టుకుని చేసుకోవాల్సిందే.