Rain Alert : కుండపోత వర్షం.. ఈ జిల్లాల్లో రెడ్ అలెర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీరం తాకింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి

Update: 2024-12-13 04:26 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీరం తాకింది. అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే వర్షాలు పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులోని పదిహేడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది. పుదుచ్చేరిలోనూ వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ భారీ వర్షాలపై సమీక్షను నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈరోజు మొత్తం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చేసిన సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నదులు ఉప్పొంగుతుండటంతో...
ఆంధ్రప్రదేశ్ లోనూ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షం ఎక్కువగా పడుతుంది. నదులు ఉప్పొంగుతున్నాయి. తిరుపతి, తిరుమలలో కూడా భారీ వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. శ్రీకాళహస్తి, ఏర్పేడు రేణిగుంట ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, నదులు, కాల్వలు దాటే టప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, దాటే ప్రయత్నం చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ పంట నష్టం జరుగుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ధాన్యం వర్షంతో తడవడంతో అన్నదాతలు విలపిస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
నిండుకుండలా ప్రాజెక్టులు...
భారీ వర్షంతో ప్రాజెక్టులు కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకోవడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోసారి తమిళనాడు భారీ వర్షాలతో ఇబ్బంది పడుతుంది. పదిహేడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇటీవల వచ్చిన ఫెంగల్ తుపాను కు తమిళనాడు అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. తిరిగి మరోసారి భారీవర్షలు పడుతుండటంతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడనిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయంఏర్పడింది. చెన్నై ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు. మరి కొద్ది గంటల పాటు వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.



Tags:    

Similar News