Andhra Pradesh : భజన మానండి.. జనం బాట పడితేనే.. భవిష‌్యత్.. లేదంటే.. కామ్రేడ్స్ కనుమరుగే
ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చజరుగుతుంది.
ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది ఒక దారి అన్నట్లు తయారయింది ఆంధ్రప్రదేశ్ సీపీఐ పరిస్థితి. దేశంలో ఇండియా కూటమితో అది ప్రయాణిస్తుంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పొరుగున ఉన్న తెలంగాణలోనూ కాంగ్రెస్‌తో సీపీఐ జట్టు కట్టింది. ఫలితంగా తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టగలిగింది. భవిష్యత్ లో శాసనమండలిలోనూ ఆ పార్టీకి ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. ఇలా తెలంగాణలో సీపీఐ ఒకరకంగా వెళుతుంటే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. వామపక్ష పార్టీలు ప్రజల పక్షాన నిలుస్తాయి. పేదల పక్షాన నిలిచి వారి సమస్యలపై పోరాటం చేసేందుకు అవసరమైతే ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతాయి.
వామపక్ష పార్టీలు...
కొన్ని దశాబ్దాలుగా వామపక్షాలు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కానీ ఏపీలో మాత్రం సీపీఐ పరిస్థితి వేరులా ఉంది. అది చంద్రబాబు నాయుడు జేబు సంస్థగా మారిందన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా టీడీపీ భజన చేసే పార్టీగా సీపీఐ మారిందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. వామపక్ష పార్టీల్లో సీపీఎంది ఒక రూటు కాగా, సీపీఐది మరొక దారిగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంత వరకూ వామపక్షాలు శాసనసభలోకి కాలుమోపలేకపోయాయి. 2014లో విడిగా పోటీ చేశాయి. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కట్టిన కూటమితో పనిచేశాయి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ తో జతకట్టాయి. మూడుసార్లు కూడా ప్రజలు సీపీఐని ఆదరించలేదు. పోటీ చేసిన చోట డిపాజిట్లు కూడా దొరకలేదు.
పొత్తులు పెట్టుకుంటూ...
2019 నుంచి 2024 ముందు వరకూ టీడీపీతో సీపీఐ కలసి నడిచింది. అందులో తప్పులేదు. ప్రజాసమస్యలపై పోరాడటం కోసం టీడీపీ వెంట నడిచింది. అమరావతి రాజధాని అంశం కావచ్చు.. విశాఖ ఉక్కు కర్మాగారం, ప్రయివేటీకరణ...ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు.. అంగన్ వాడీ వర్కర్ల నిరసనలు కావచ్చు.. ఇలా అనేక అంశాలతో పోరాటం చేసింది. పీడిత ప్రజలకు ఆసరాగా నిలవడంలో ఎప్పుడూ కమ్యునిస్టు పార్టీలు ముందుంటాయని అందరూ అనుకుంటారు. అయితే 2024 లో చంద్రబాబుతో జత కట్టి బరిలోకి దిగుదామని భావించినా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కాంగ్రెస్ తో కలసి వెళ్లక తప్పలేదు. మూడోసారి కూడా గెలుపు దక్కలేదు. ఎన్నికల సమయంలో అధికార వైసీపీని విమర్శించడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే అధికార పార్టీలో లోపాలను ధైర్యంగా ఎత్తిచూపేది కమ్యునిస్టులే.
బీజేపీతో జత కట్టిన...
కానీ టీడీపీ అధికారంలోకి రాగానే సీపీఐ వాయిస్ మారినట్లుకనపడుతుంది. బలవంతం, భయపెట్టినందువల్లే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సీపీఐ నేతలు చేసిన సూత్రీకరణ కూడా తమను తాము సమర్థించుకోవడం లాంటిదే. సిద్ధాంతాలతో వెళ్లాల్సిన కమ్యునిస్టు పార్టీ అయిన సీపీఐ మాత్రం తన రూటు సపరేట్ అని చెప్పకనే చెబుతుంది. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. ఇందులో తప్పు ఒప్పులను ఎంతన్నది పక్కన పెడితే భవిష‌్యత్ లో టీడీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా సీపీఐ ఎలా పోరాడగలదని? క్యాడర్ కు ఏరకమైన సంకేతాలు పంపినట్లవుతుందన్న ప్రశ్న ఆ పార్టీ కిందిస్థాయి కార్యకర్తల నుంచే ఎదురవుతుంది. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ను పనిగట్టుకుని వెళ్లి మరీ అభినందించడమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. జగన్ ప్రభుత్వంలో ప్రతి అంశంపై అఖిలపక్షం పెట్టాలంటూ యాగీ చేసిన కామ్రేడ్లు ఇలా చేస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందా? అన్నదే ప్రశ్న. మొత్తం మీద కామ్రేడ్లు తమకు నచ్చిన వారితో జతకట్టేందుకు సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారన్నది సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.