పిన్నెల్లిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం : ఈసీ

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు

Update: 2024-05-23 12:17 GMT

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పిన్నెల్లి కోసం ఇప్పటికే ఎనిమిది పోలీసులు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఆయనను అరెస్ట్ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉందని చెప్పారు. ఇప్పటికే సరైన సమాచారం ఇవ్వనందుకు పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. మాచర్ల నియోజకవర్గం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, ఇప్పుడే పరామర్శల పేరుతో అక్కడకు రాజకీయ నేతలు వెళతామని అనడం సరి కాదన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే సమయంలో మళ్లీ రెచ్చగొట్టే విధంగా పర్యటనలు చేయడం సరికాదన్నరు.

మాచర్లకు అనుమతి లేదు...
బయట నుంచి నేతలు ఎవరూ మాచర్ల నియోజకవర్గానికి పరామర్శకు వెళ్లకూడదని ఆయన తెలిపారు. ఎవరు వెళ్లినా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలను ఎన్నికల కమిషన్ విడుదల చేయలేదని కూడా ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఎక్కడి నుంచి బయటకు వెళ్లాయో తెలియదని ఆయన అన్నారు. ఈ నెల 25 నుంచి తాను స్ట్రాంగ్ రూంలలో భద్రతను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. మరో వైపు ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News