ఉండవల్లిలో నేడు పిఠాపురం పంచాయతీ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు తన నివాసానికి పిలిచారు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు తన నివాసానికి పిలిచారు. ఈరోజు తనతో సమావేశానికి రావాలని వర్మకు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారు. అయితే తాను చంద్రబాబును కలుస్తానని వర్మ చెబుతున్నారు. తన అనుచరులు, టీడీపీ నేతలు ఈరోజు పిఠాపురంలో సమావేశం పెట్టుకున్నారని, ఆ సమావేశం తర్వాత తాను వచ్చి కలుస్తానని చెప్పారు. దీంతో పిఠాపురంలో వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ నెలకొంది.
పవన్ పోటీ చేస్తానని...
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో పిఠాపురంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జెండాలతో పాటు, సూపర్ సిక్స్ ప్రచార సామాగ్రిని కూడా దహనం చేశారు. స్థానికేతరులకు ఇక్కడ అవకాశం ఇవ్వమంటూ వారు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే చోటే ఇలాంటి పరిస్థితులు ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై టీడీపీ, జనసేన పార్టీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. ఈరోజు పిఠాపురం పంచాయతీ ముగిసిన తర్వాత కానీ ఏం జరుగుతుందన్నది తేలదు.