Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..చంద్రబాబు ఆ పని చేస్తే ఇక తిరుగులేదటగా.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సూపర్ సిక్స్ తో పాటు మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకుని పాలన సాగించాలని నిర్ణయించారు. అందుకోసం అధికారులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టకపోయినా తొలినాళ్లలోనే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ప్రభుత్వం అందుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ప్రజలు మెచ్చేలా నిర్ణయాలు ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
గత ప్రభుత్వంలో...
అందులో ప్రధానమైనది పెట్రోలు, డీజిల్ ధరలు. గత ప్రభుత్వం వ్యాట్ పెంచడంతో పెట్రోలు ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే ఒక రూపాయి ఎక్కువగానే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే రోడ్ల అభివృద్ధి, మరమ్మత్తుల కోసమేనని గత వైసీపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. చంద్రబాబు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళితే ఉన్న పెట్రోలు ధరలు మన రాష్ట్రంలో ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ఏపీ మీదుగా వెళ్లే ఇతర రాష్ట్రాల వాహనాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు, డీజిల్ ను కొనుగోలు చేయడం మానివేశాయి. పొరుగు రాష్ట్రాల్లోనే ట్యాంక్ ఫుల్ చేయించుకుని రాష్ట్ర సరిహద్దులు దాటేస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో...
ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, మరోవైపు తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ధరలను తగ్గించాలంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో పదే పదే డిమాండ్ చేశారు. దీనివల్ల వచ్చే ఆదాయం కంటే పోయే పన్నులు ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విజయవాడ లారీ యజమానుల అసోసియేషన్ కూడా ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తుంది. దీంతో చంద్రబాబు నాయుడు పెట్రోలు ధరలపై సమీక్ష నిర్వహించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా అంటే తెలంగాణలో లభ్యమయ్యే ధరలనే ఏపీలో అందుబాటులోకి తెచ్చేలా నిర్ణయం తీసుకోనున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.