తిరుమల క్యూ లైన్లలో కొట్లాట.. ఇద్దరికీ గాయాలు
తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి 35 గంటల సమయం పడుతుంది. దీంతో క్యూలైన్లలో భక్తుల మధ్య గొడవ జరిగింది
తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి 35 గంటల సమయం పడుతుంది. అయితే క్యూలైన్లలో ఉన్న భక్తుల మధ్య గొడవ జరిగింది. తిరుమలలో రష్ ఎక్కువగా ఉన్నా అందరికీ దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయినా భక్తులు సంయమనం కోల్పోతున్నారు. తమిళనాడు, గుంటూరుకు చెందిన భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారని చెబుతున్నారు.
విజిలెన్స్ విచారణ...
గుంటూరు నుంచి వచ్చిన భక్తులు టాయ్ లెట్ కు వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ తమిళనాడు భక్తులను కోరారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వివాదం ప్రారంభమయింది. మాట మాట పెరిగింది. తోపులాట జరిగింది. చివరకు క్యూలైన్లలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. మిగిలిన భక్తులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఘర్షణ ఆగలేదు. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ జరుపుతున్నారు.