Ys Jagan : జగనూ.. ముందు చేయాల్సింది ఇదీ.. దానిని వదిలేస్తే మళ్లీ మొదటికే
మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణ ఓటమిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అస్సలు ఊహించలేదు.
మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణ ఓటమిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది లబ్దిదారులు తనకు కనెక్ట్ అయి ఉండటతో వారు ఓటేసినా తనకు చాలునన్న భ్రమలో ఉండిపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ ఎక్కువగా సంక్షేమ పథకాలు అందాయో... అక్కడే తక్కువ ఓట్లు వైసీపీకి పోలయినట్లు వచ్చిన నివేదికలు ఆయనకు షాక్ కు గురి చేస్తున్నాయట. సహజంగా అర్బన్ ప్రాంతంలో కొంత దెబ్బతినే అవకాశముందని ముందుగానే అంచనా వేసినప్పటికీ, రూరల్ ప్రాంతంలో తమకు పట్టు సడలిపోదని ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ తీరా గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ దారుణంగా దెబ్బతినింది.
ప్రయోజనం పొందిన వారే...
దీనికి కార్యకర్తలే ప్రధాన కారణమని ఇప్పుడు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరుపున పనిచేయడానికి కార్యకర్తలు ఎవరూ ముందుకు రాలేదట. ఎమ్మెల్యేలతో ఆర్థిక ప్రయోజనాలున్న వారు మాత్రమే ఆ యా నియోజకవర్గాల్లో కొంత పనిచేశారు తప్పించి.. 2014, 2019 ఎన్నికల్లో చొక్కాలు చింపుకుని పనిచేసిన కార్యకర్తలు మాత్రం మొన్నటి ఎన్నికల్లో మౌనంగానే ఉండిపోవడం కూడా పార్టీకి ఇంతటి నష్టం జరగడానికి కారణమని జగన్ ను కలసిన ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎక్కడికీ పోరని ఎమ్మెల్యేలు కూడా వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు మనస్తాపానికి గురయ్యారు.
తెగిన సంబంధాలను...
మరోవైపు ప్రజలతో కార్యకర్తలకు ఉన్న సంబంధాలు పూర్తిగా జగన్ తెంపేశారు. వాలంటీర్లను తెచ్చి మధ్యలో పెట్టడంతో వారు ఎందుకూ పనికిరాకుండా పోయారు. ప్రజలు కూడా కార్యకర్తలు, స్థానిక నేతలపై ఆధారపడకుండా వాలంటీర్లకే తమ సమస్యలు చెప్పుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు నేరుగా జగన్ కు చెప్పారట. అలాగే కాంట్రాక్టర్లు, గ్రామాల్లో శాసించే నాయకులు కూడా తమకు ఉపయోగపడని పార్టీకి తాము ఎందుకు పనిచేయాలన్న ధోరణితో ఉన్నారని చెబుతున్నారు. ప్రయోజనాలు పొందిన కొద్ది మంది మాత్రమే ఈ ఎన్నికల్లో పనిచేసినా వారి శక్తి సరిపోలేదు. దీనికి తోడు కులాల పొలరైజేషన్ కూడా బాగా పనిచేయడంతో ఎవరూ ఏం చేయలేని పరిస్థిితి నెలకొంది.
జిల్లాల వారీగా...
ఇప్పటికిప్పుడు కాకపోయినా.. రానున్న ఏ ఎన్నికల్లోనైనా వైసీపీ తన బలాన్ని నిరూపించుకోవాలంటే తిరిగి క్యాడర్ ను కూడగట్టుకోవడం ముఖ్యం. ముందు జగన్ ఆ పని చేయాలంటున్నారు. కేవలం సానుభూతి వ్యవహారాలు పనిచేసే రోజులు పోయాయని, క్యాడర్ లేకపోతే రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఇదేరకమైన ఫలితాలు చూడక తప్పదని నేతలు సయితం చెబుతున్నారు. నేతలు కూడా పెద్ద సంఖ్యలో జారి పోయే అవకాశముంది. అయితే అందులో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. 2029 ఎన్నికలకు సమాయత్తం కావాలంటే ఇప్పటి నుంచే జిల్లాల వ్యాప్తంగా సమావేశాలను నిర్వహించి ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారిని తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయగిలిగితేనే కొంత ఫలితం ఉంటుందని నేతలు జగన్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం.