Summer Effect : ఉడికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి;

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటం ఆందోళనకు గురి చేస్తుంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పండగలు, పబ్బాలు చేసుకునేందుకు కూడా వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉక్కపోత, వేడిగాలులు, ఎండ తీవ్రత మూడు కలసి జనం మీద ఏకకాలంలో దాడి చేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు మార్చి నెలలో చూడలేదని చెబుతున్నారు.
ఆరెంజ్ అలెర్ట్...
వాతావరణ శాఖ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వడదెబ్బ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఇంటిపట్టునే ఉండటం క్షేమకరమని సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండటం, రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం వంటివి చేస్తూ శరీరాన్ని డీహైడ్రేషన్ కు లోనుకాకుండా చూసుకోవాలని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు. నీటి శాతం శరీరంలో తగ్గితే ఖచ్చితంగా వడదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.
రెండు రాష్ట్రాల్లో...
తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనూ నలభై డిగ్రీలు నమోదయ్యాయి. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. పొడి వాతావరణం కావడంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమీ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీలు నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచించింది.