Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే.. శనివారం అయినా?
తిరుమలలో రద్దీ కొద్దిగా తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి పోల్చుకుంటే శనివారమయినా భక్తుల రద్దీ అంతగా లేదు;

తిరుమలలో రద్దీ కొద్దిగా తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి పోల్చుకుంటే శనివారమయినా భక్తుల రద్దీ అంతగా లేదు. వరస సెలవులు వచ్చినా, ఉగాది కావడంతో పాటు తొలి పండగ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు రాలేదని చెబుతున్నారు. అందుకే తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నిన్నటి వరకూ అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉండేది. కానీ నేడు మాత్రం కొన్ని కంపార్ట్ మెంట్లు మాత్రమే భక్తులతో నిండిపోయి ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కొద్ది రోజులుగా...
గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారంతో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కొన్ని పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తిరుమలకు చేరుకుని ఏడుకొండల వాడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో అనేక మంది పెళ్లి అయిన తర్వాత కొత్త జంటలతో పాటు ఎక్కువ మంది వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తొమ్మిది కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,669 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,780 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.