Sujana Chodhary : సుజనా చౌదరిని పార్టీ నాయకత్వమే అలా దెబ్బేసిందటగా?
బీజేపీ నేత సుజనా చౌదరికి ఈసారి రాజకీయంగా కలసి రాలేదని అనుకోవాలి;

బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఈసారి రాజకీయంగా కలసి రాలేదని అనుకోవాలి. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన కేవలం ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలో ఒక ఊపు ఊపిన నేత నేడు మౌనంగానే ఉంటున్నారు. తన నియోజకవర్గానికే పరిమితి అయ్యారు. కాదు.. కాదు.. నియోజకవర్గానికి.. అందులోనూ విజయవాడలోని ఒక ప్రాంతానికే పార్టీ పరిమితం చేసిందని చెప్పక తప్పదు. సుజనా చౌదరి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత. టీడీపీ నుంచి బలమైన నేతగా ఎదిగినా 2019 ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలయిన తర్వాత సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ అయ్యారు.
కష్టమైన చోట...
అప్పటి వరకూ కేంద్ర మంత్రిగా ఆయన రాష్ట్రంలో పర్యటిస్తూ హల్ చల్ చేసేవారు. ఆయన తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. కానీ బీజేపీ ఆయన ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినట్లయిందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో సా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేశారు. పార్టీ కూడా వెంటనే ఆయన కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. ఎంపీ టిక్కెట్ ఆశిస్తే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి మొదటి దెబ్బ కొట్టిందంటారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమిలోని మూడు పార్టీలూ ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది కానీ అదీ 1983లో మాత్రమే. అంటే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయం అనేది దొరకలేదు. అంటే నలభై ఏళ్లకు పైగానే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా చూడటం లేదనే చెప్పాలి.
కమ్యునిస్టులు ఇలాకాలో....
ప్రజారాజ్యం పార్టీ ఒకసారి గెలిచింది. 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అయితే ఇక్కడ నుంచి సుజనా చౌదరి ఎట్టకేలకు నెగ్గుకొచ్చారు. గెలిచి చూపించారు. పార్టీ నాయకత్వం కూడా ఊహించలేదంటారు. ఆ నియోజకవర్గం చరిత్ర చూస్తే ఎవరైనా అక్కడి నుంచి పోటీ చేయడానికి భయపడే పరిస్థితి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 1972లో అసిబ్ బాషా, 1989లో ఎంకే బేగ్, 1999లో కాంగ్రెస్, 20214లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ , 20024లో కమ్యునిస్టు పార్టీ అభ్యర్థిగా నాజర్ వలి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వామపక్షాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే ఆ ఓటు బ్యాంకు సుజనాకు రావడం కష్టమేనని భావించి టిక్కట్ ఇచ్చిందా? అన్న అనుమానాలు అందరిలోనూ కలిగాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుజనా చౌదరి గెలుపొందారు.
మంత్రి పదవి ఖాయమనుకున్నా...
సుజనా చౌదరి తాను ఎమ్మెల్యేగా గెలవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి పదవి రావడం ఖాయమని భావించారు. కానీ ఆయన ఆశలుతలకిందులయ్యాయి. 2014లో కమ్మ సామాజికవర్గం నుంచి కామినేని శ్రీనివాసరావుకు అప్పట్లో మంత్రి పదవి లభించడంతో అదేకోటాలో తనకు లభిస్తుందనిగట్టిగా నమ్మకం పెట్టుకున్నా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సత్యకుమార్ కు మంత్రి పదవి లభించడంతో సుజనా తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి పెద్దగా పార్టీలో యాక్టివ్ గా లేకపోవడంతో పాటు తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. అలాగని పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కాదనే సాహసాన్నిసుజనా చౌదరి చేయరన్నది వాస్తవం. ఎందుకంటే కేంద్ర నాయకత్వంతో పెట్టుకుంటే పాత కేసులు తిరగదోడే అవకాశముండటంతో సమయం కోసం వెయిట్ చేయడం తప్ప సుజనా చేయగలిగిందేమీ లేదు.