24 ఏళ్ల నిత్య పెళ్లికూతురి గుట్టురట్టు.. విడాకులివ్వకుండా మూడు పెళ్లిళ్లు
శిరీష కోరిక మేరకు మహేశ్వర్ రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. ఫిబ్రవరిలో వీరిద్దరికీ మద్దిలేటిస్వామి క్షేత్రంలో వివాహం ..
నంద్యాల : ఒక్కరికి కూడా విడాకులివ్వకుండా 24 ఏళ్ల యువతి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యామండలం మిట్నాల గ్రామానికి చెందిన శిరీష (24) తల్లి మేరీ జసింటాతో కలిసి నివసిస్తోంది. బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని శిరీష పెళ్లి చేసుకోవాలని భావించింది. మహేశ్వర్ కు ఇది రెండో వివాహం కావడంతో.. శిరీష తనకు ఆర్థిక భద్రత ఇచ్చేలా రూ.5 లక్షలు తనపేరున బ్యాంకు డిపాజిట్ చేయాలని కోరింది.
శిరీష కోరిక మేరకు మహేశ్వర్ రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు. ఫిబ్రవరిలో వీరిద్దరికీ మద్దిలేటిస్వామి క్షేత్రంలో వివాహం జరిగింది. వివాహం అనంతరం మహేశ్వర్ రెడ్డి స్వగ్రామమైన ఆర్ఎస్ రంగాపురంలో దంపతులు కాపురం పెట్టారు. కొద్దిరోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత శిరీష తల్లి తన కుమార్తె అత్తారింట్లో కాపురం చేయాలంటే మరింత నగదుతో పాటు.. ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేసింది. తల్లీ, కూతుళ్ల వేధింపులు భరించలేక మహేశ్వర్ రెడ్డి శిరీష గురించి ఎంక్వైరీ చేశాడు. ఆమెకు ఇదే మొదటి పెళ్లి కాదని, గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. వారిద్దరికీ విడాకులివ్వకుండానే తనను పెళ్లి చేసుకుందని తెలిసి విస్తుపోయాడు.
నిత్యపెళ్లికూతురి వలలో చిక్కి.. తాను మోసపోయానని గ్రహించిన మహేశ్వర్ రెడ్డి.. పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో మహేశ్వర్ రెడ్డి చెప్పిందంతా నిజమేనని తేలింది. ఆమెకు తొలుత అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జునరెడ్డితో.. ఆ తర్వాత ఆత్మకూరు మండలం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డితో పెళ్లిళ్లైనట్లు తేలింది.