Kala Venkat Rao : కళా వెంకట్రావు వ్యతిరేక నేతకూ టిక్కెట్.. చంద్రబాబు ఊహించని ట్విస్ట్
ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు టీడీపీలో వ్యతిరేకంగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు
చివరి జాబితాలో...
కళా వెంకట్రావు పార్టీలో సీనియర్ నేత. ఆయన గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు. అయితే ఆయనకు చివర వరకూ టిక్కెట్ ఖరారు కాలేదు. లాస్ట్ లిస్ట్ లో ఆయన పేరు కనిపించింది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో అక్కడ ఆయనకు సీటు దక్కలేదు. చివరి జాబితాలో కళా వెంకట్రావును చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన వైసీీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణను ఎదుర్కొనాల్సి ఉంది. చీపురుపల్లిలో గెలుపు అంత ఆషామాషీ కాదు. అందుకే ఆయన తనకు ఎచ్చెర్ల టిక్కెట్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు.
మాజీ జర్నలిస్టుకు...
అదే సమయంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో గత ఐదేళ్ల నుంచి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా గ్రూపు ఏర్పాటు చేసిన టీడీపీ యువనాయకుడు కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేశారు. కలిశెట్టి తొలుత జర్నలిస్టు. ఒక ప్రముఖ దినపత్రికలో రణస్థలం మండలానికి 1995 నుంచి 2000 వరకూ రిపోర్టర్ గా పనిచేసి తర్వాత టీడీపీలో చేరారు. అప్పట్లో తమ్మినేని సీతారాం శిష్యుడిగా కలిశెట్టి ముద్రపడ్డారు. ఆ తర్వాత మాజీ స్పీకర్ ప్రతిభా భారతి శిష్యరికం కూడా చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితే కొంత కాలం నుంచి ఎచ్చెర్లలో ఉంటూ కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా పార్టీలో పనిచేస్తూ వచ్చారు. కలిశెట్టి కూడా తనకు ఎచ్చెర్ల సీటు ఇవ్వాలంటూ 2019 నుంచి అధినాయకత్వంపై వత్తిడి తెస్తున్నారు. కళాకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేపట్టారు.
అచ్చెన్న ప్రోత్సాహంతో...
అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో కలిశెట్టి కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారని కళా వర్గీయులు అధినాయకత్వానికి ఆరోపించారు. అయితే చంద్రబాబు కళా వెంకట్రావుకు చీపురుపల్లి కేటాయించి కలిశెట్టికి విజయనగరం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వడం ఇప్పుడు విజయనగరం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. కళా వెంకట్రావు తాను అనుకున్న సీటు దక్కకపోగా, తన వ్యతిరేకికి విజయనగరం పార్లమెంటు సీటు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందని ఇద్దరు నేతలు అనుమానిస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్‌కు కళా వెంకట్రావు వర్గానికి మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు.