Chandrababu : అనుకున్నది సాధించారు.. కష్టాలకు ఎదురొడ్డి నిలిచి మరీ నెగ్గే దిశగా

ముఖ్యమంత్రిగానే శాసనసభలోకి అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి మరీ బయటకు వెళ్లారు

Update: 2024-06-04 05:08 GMT

గత ఐదేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలు పడింది. నేతలు, క్యాడర్ కూడా బయటకు రావడానికి భయపడ్డారు. అలాంటి పరిస్థితుల నుంచి పార్టీని బయటకు తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తాను ముఖ్యమంత్రిగానే శాసనసభలోకి అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి మరీ బయటకు వెళ్లారు. ఆయన తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలకు చలించి, వ్యక్తిగత విమర్శలకు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. అయినా పార్టీ నేతల నుంచి పెద్దగా సహకారం లభించలేదు. రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడలేదు. అలాంటి స్థితి నుంచి పార్టినీ గెలిచే స్థాయికి తీసుకు వచ్చారంటే చంద్రబాబు ఎంత కష్టపడ్డారో చెప్పాల్సిన పనిలేదు.

Full Viewప్రజల్లోకి బలంగా...
అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో నిరంతరం గడిపారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన పడుతున్న కష్టాన్ని చూసి జనం చలించిపోయారు. ఒకటా.. రెండా.. బ్రేకుల్లేకుండా ఆయన చేసిన పోరాటం మామూలుగా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో నలుమూలలూ పర్యటించారు. అనేక నినాదాలను అందిపుచ్చుకుంటూ చంద్రబాబు నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపగలిగారు. పేద, మధ్య, ధనిక, ఉద్యోగ వర్గాలను తన వైపు తిప్పుకోవడమేకాకుండా, జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ ఇక బాగుపడదన్న సంకేతాలను బలంగా తీసుకెళ్లగలిగారు.
సొంత పార్టీ నేతలను...
దీంతో పాటు సొంత పార్టీ నేతలను త్యాగాలు చేయమని చెబుతూ సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టారు. అసంతృప్తులు వస్తాయని ఊహించినా వెరవలేదు. దేవినేని ఉమ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అశోక్ గజపతి రాజు వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగడం భారీగా లాభించిందనే చెప్పాలి. కూటమి ఏర్పాటు కావడంతో పాటు సామాజికవర్గాల సమీకరణతో పాటు, ఓట్ల బదిలీ విషయంలో కూడాఅన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని చెప్పాలి. చంద్రబాబు అనుకున్నది సాధించారు. జగన్ ను ఓటమి వైపు నెట్టగలిగారు. ఇంతటి విజయాన్ని బహుశా చంద్రబాబు కూడా ఊహించి ఉండకపోవచ్చు. మొత్తం మీద శాసనసభలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్లే కనపడుతుంది.


Tags:    

Similar News