Ap Elections : మనసున ఉన్నదీ.. చెప్పాలని లేదా? సైలెంట్ ఓటింగ్ .. సైడు తీసుకోనుందా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైలెంట్ ఓటర్లు ఎవరిని దెబ్బతీస్తారన్న చర్చ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది;
కులమే ముఖ్యమా?
ఓటరు మనసులో ఏముందో బయటకు చెప్పరు. కరడు గట్టిన పార్టీ కార్యకర్తలే ఓపెన్ అవుతారు. అందుకే సర్వేలలో వాస్తవ ఫలితాలు ప్రతిబింబించవు. అందుకు అనేక కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విభిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. అందులో కులం ముఖ్యం. కులం తర్వాతే డబ్బు.. గుణం.. మరేదైనా.. మన కులపోడయితే చాలు బటన్ నొక్కడానికి రెడీ అయిపోతారు. అంతటి కులపిచ్చి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈసారి ఫలితాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. అయితే చాలా మంది ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉండవచ్చు. కొందరు అటు ఇటుగా ఉండి ఉండవచ్చు. మ్యానిఫేస్టోలను అన్ని పార్టీలు విడుదల చేసిన తర్వాత ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ చేసుకుంటారు.
పోలింగ్ తేదీ రోజు...
అయితే అది పోలింగ్ తేదీ వరకూ ఉంటుందా. అన్నది కూడా అనుమానమే. పోలింగ్ కు ముందు రోజు మనసు మారే అవకాశముంది. అలాగే అనేక కారణాలు జనం మూడ్ ను ఛేంజ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ పై పార్టీ అగ్రనేతలు భయపడుతున్నారు. ఎవరి వైపు మొగ్గు అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. ఒకవైపు సంక్షేమ పథకాలను చూసి జగన్ కు ఓటేయాలా? లేదా రాష్ట్ర అభివృద్ధి ఏదో జరుగుతుందని ఆశించి కూటమి వైపు నిలబడాలా? అన్నది తేల్చుకోవడానికి ఓటరకు ఇంకా సమయం ఉంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పనిలేదు. ఆ అవసరం కూడా ఓటరుకు ఉండదు. చివరకు తన మనసులో పలానా పార్టీ అయితే బెటర్ అన్న దానివైపే మొగ్గు చూపుతాడు. అందుకే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ ఎటు వైపు మొగ్గు చూపుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తటస్థ ఓటర్లు ఏం చేయనున్నారు?
ఇక ఆంధ్రప్రదేశ్ లో తటస్థ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరంతా ఓటు విషయంలో ఒక డిసైడ్ కు వచ్చినా పోలింగ్ తేదీ రోజున కేంద్రానికి వస్తారన్న గ్యారంటీ లేదు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లంతా కంపల్సరీ కరడు కట్టిన పార్టీ కార్యకర్తలు. అభిమానులే ఉంటారు. తటస్థ ఓటర్లు ప్రస్తుత రాజకీయాలపై విసుగు చెంది ఉన్నారు. ఎవరు గెలిచినా తమకు ఒరిగేదేముందన్న నిరాశలో మునిగిపోయి ఉన్నారు. ఎవరు వచ్చినా జరగాల్సిన అభివృద్ధి జరగక మానదు. అందాల్సిన సంక్షేమం అందక మానదు. అందుకే ఇప్పుటు సైలెంట్ ఓటర్లు ఏపీలో కీలకంగా మారనున్నారు. తటస్థఓటర్లు ఎటువైపు ఉంటే వారికి కూడా విజయావకాశాలు ఎక్కువేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అన్నది మాత్రం మే 13 న ఓటరు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.