Ys Jagan : జగన్ ఎలక్షనీరింగ్ పనిచేస్తుందా? ఈ ప్రయోగం ఫలించకపోతే.. ఇక పాతపద్ధతి బెటర్ అన్నట్లేగా?

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగిన ఎన్నికలు విభిన్నంగా జరిగాయి. వైసీపీ అధినేత జగన్ కొత్త ఒరవొడిని సృష్టించారు

Update: 2024-05-31 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగిన ఎన్నికలు విభిన్నంగా జరిగాయి. ఎందుకంటే కేవలం మ్యానిఫేస్టోనే కాదు... అభ్యర్థుల ఎంపిక కూడా ఈసారి విలక్షణంగా జరిగిందనే చెప్పాలి. అందులో రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ కొత్త ఒరవొడిని సృష్టించారు. గతంలో ఎవరూ చేయని సాహసానికి ఆయన ఒడిగట్టారనే చెప్పాలి. దేశ రాజకీయాల్లో ఇది అతి పెద్ద ప్రయోగంగానే చూడాలి. ఒకరకంగా జగన్ పాత రాజకీయాలకు బ్రేక్ చేసే విధంగానే ఆయన నిర్ణయాలున్నాయి. అతి ప్రమాదకరమైన గేమ్ ను జగన్ మొదలుపెట్టారని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. జగన్ మొదలు పెట్టిన ఈ ఆటలో ఆయన సక్సెస్ అయితే దేశం అనుసరించక తప్పని పరిస్థితి ఉంటుందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది.

మొన్నటి ఎన్నికల వరకూ...
గతంలో సామాజికవర్గాలను పెద్దగా చూసేవారు కాదు. ఆ నియోజకవర్గంలో బలమైన నేతను చూసి అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. అంతేకాదు ఆర్థికంగా ఆయనకున్న ప్లస్, మైనస్ లను కూడా పరిగణనలోకి తీసుకుని మరీ బరిలోకి దించేవారు. మంచిపేరుతో పాటు వెనక కోట్లాది రూపాయలున్న వారికే టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి కొన్ని దశాబ్దాలుగా కొనసాగింది. అన్ని పార్టీలూ అంతే. అందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కానీ 2014 రాష్ట్ర విజభ తర్వాత కొంత మార్పు కనిపించింది. ఏపీలో కులసమీకరణాలు ఎక్కువ. కుల రాజకీయాలు పుష్కలం. ఎందుకంటే ఏపీలో గుణం చూసి ఓట్లేసే వారికన్నా కులం చూసి బటన్ నొక్కే వారు అధికంగా ఉండటంతో అన్ని పార్టీలూ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత నిచ్చాయి. ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఆటోమేటిక్ గా వచ్చాయి. అన్ని పార్టీలూ అదే పంథాను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వారికే అత్యధికంగా...
కాకుంటే ఈ ఎన్నికల్లో జగన్ ఒక అడుగు ముందుకు వేశారు. ఎలాగంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధికంగా సీట్లను కేటాయించి ఒకరకంగా ప్రత్యర్థి పార్టీలకు గట్టి సిగ్నల్స్ పంపగలిగారు. శాసనసభ, పార్లమెంటు స్థానాలు కలిపి ఏపీలో 200 ఉంటే అందులో వందకు పైగా స్థానాల్లో బలహీన వర్గాలకు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. చివరకు పార్టీ కార్యకర్తలకు కూడా టిక్కెట్లు కేటాయించారు. ఇందుకు శింగనమల నియజకవర్గమే ఉదాహరణ. ఒక ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులుకు సీటును కేటాయించి జగన్ ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేశారనే చెప్పాలి. అలాగే మడకశిర నియోజకవర్గంలో కూడా సామాన్యుడికే టిక్కెట్ కేటాయించారు. అక్కడ ఎర్రలక్కప్పకు సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బహుశా గతంలో ఎవరూ ఇలా చేసి ఉండరు.
టీడీపీకి అండగా ఉండే...
ఆంధ్రప్రదేశ్ లో బీసీ సామాజికవర్గం ఎక్కువ. అది టీడీపీకి ఎప్పటి నుంచో అండగా ఉండే వర్గం. అలాంటి వర్గానికి అధిక సీట్లను కేటాయించి ప్రత్యర్థి పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టేశారనే చెప్పాలి. పార్లమెంటు సీట్లు చూస్తే బీసీలకు సీట్లను కేటాయించి జగన్ మరో కొత్త తరహా పాలిటిక్స్ కు తెరతీశారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఒకవైపు సంక్షేమ పథకాలు.. మరొకవైపు క్యాస్ట్ పొలరైజేషన్ పై జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈసారి జగన్ చేసిన ప్రయత్నం కరెక్టా? కదా? అన్నది తెలియాలంటే ఫలితాలు వచ్చేంత వరకూ ఆగాల్సిందే. అయినప్పటికీ జగన్ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి అందరూ దానిని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలవకపోతే మాత్రం మళ్లీ పాత పద్ధతినే అవలంబించాల్సి ఉంటుంది. చూడాలి మరి.. జగన్ ను అందరూ అనుసరిస్తారా? లేక జగనే తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసుకుంటారా? అన్నది జూన్ 4వ తేదీన తేలనుంది.


Tags:    

Similar News