Paderu : ఇక్కడ గిడ్డి ఈశ్వరి గెలిస్తే హిస్టరీని క్రియేట్ చేసినట్లే.. ఒకసారి గెలిచినోళ్లకు ఇక్కడ నో ఛాన్స్

విశాఖ జిల్లాలోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గమైన పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పట్టుబట్టి మరీ టిక్కెట్్ సాధించుకున్నారు.

Update: 2024-04-26 08:22 GMT

విశాఖ జిల్లాలోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గమైన పాడేరులో  మాజీ  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పట్టుబట్టి మరీ టిక్కెట్ సాధించుకున్నారు. పట్టు అనేకంటే ఒకకరకంగా బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నారని అనుకోవాలి. తనకు టిక్కెట్ రానివ్వకుండా అచ్చెన్నాయుడు అడ్డుపడ్డాడంటూ ఏకంగా ఆమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే కామెంట్స్ చేశారు. తొలుత పాడేరు టిక్కెట్ ను రమేష్ నాయుడు పేరును టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది. అయితే గిడ్డి ఈశ్వరి అంత తేలిగ్గా తలొగ్గలేదు. తాను తగ్గేదేలేదంటూ అనుచరులతో సమావేశమయ్యారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తానని కూడా హెచ్చరికలు పార్టీ నాయకత్వానికి పంపారు.

హైకమాండ్ ఆడించినట్లుగానే...?
అయితే అధినాయకత్వం ఆడించిన డ్రామాలో భాగంగానే జరిగిందని కొందరు అంటున్నారు. టీడీపీ అగ్రనేత చెప్పినట్లుగానే ఆమె ఆత్మీయ సమావేశాలు పెట్టడం, తనకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి టీడీపీలో చేరతానని ప్రకటించారు. తనకు టిక్కెట్ ఇవ్వని అధినాయకత్వాన్ని ఒక్క మాట అనలేదు. అచ్చెన్నాయుడు మీద మాత్రం ఫైర్ అయ్యారు. అంటే గిడ్డి ఈశ్వరి వెనక ఎవరున్నారో ఈ పాటికే అర్థమయి ఉంటుందిగా. చివరకు తొలుత ప్రకటించిన రమేష్ నాయుడిని కాదని బీఫారం గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారిక అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే టిక్కెట్ అయితే పట్టుబట్టి సాధించారు కానీ అక్కడ గెలుపుపై మాత్రం కొంత గందరగోళం ఉందని అంటుననారు.
1999లో చివరి సారిగా టీడీపీ...
పాడేరు నియోజకవర్గంలో 1999లో టీడీపీ నుంచి మణికుమారి గెలిచారు. అదే టీడీపీకి అక్కడ చివరి విజయం. అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కనుక గిడ్డి ఈశ్వరి గెలిస్తే రికార్డు క్రియేట్ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే గిరిజన నియోజకవర్గాల్లో పట్టు లేని టీడీపీ తరుపున పోటీచేసి గెలిచారంటే ప్యూర్ గా ఆమె వ్యక్తిగత బలం అనుకోవాల్సి ఉంటుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. గిడ్డి ఈశ్వరి కూడా ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి మారారు. దీంతో ఆమె తన పొలిటికల్ కెరీర్ ను ఐదేళ్లు కోల్పోయారు.
నాలుగు దశాబ్దాల నుంచి...
ఈసారి గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి మత్స్యరాజు విశ్వేశ్వరరాజును ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన భాగ్యలక్ష్మిని పార్లమెంటు అభ్యర్థిగా పోటి చేయించి ఇక్కడ విశ్వేశ్వరరాజుకు సీటు ఇచ్చింది. ఆయన కూడా గిరిజన నేత. ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన నేతను మరొకసారి గెలిపించిన చరిత్ర కూడా లేదు. 1985 నుంచి అలాగే జరుగుతుంది. ఒకసారి గెలిచి ఓడిపోయి.. మళ్లీ పోటీ చేసినా ఇంత వరకూ గెలవని నేతలు నాలుగు దశాబ్దాలుగా ఉన్నారు. అందుకే గిడ్డి ఈశ్వరికి అంత ఈజీ కాదన్నది నియోజకవర్గం గణాంకాలు చెబుతున్నాయి. చిట్టినాయుడు ఒక్కరే మూడుసార్లు గెలిచారు. అదీ నియోజకర్గం ఏర్పడిన 1967, 1972, 1983లో చిట్టినాయుడు మూడుసార్లు గెలిచారు. ఆ తర్వాత ఒకసారి గెలిచిన వారు మరొకసారి గెలవలేదు. మరి గిడ్డి జాతకం ఎలా ఉందో చూడాలి.


Tags:    

Similar News