Ap Elections : పెద్దారెడ్డి సవాల్ విన్నారా? జేసీ కాలుదువ్వడాన్ని చూశారా? తాడిపత్రిని ఆపేదెవరు?

తాడిపత్రిలో ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచినట్లే కనపడుతుంది. జేసీ, పెద్దారెడ్డి వర్గీయులు కక్షతో రగిలిపోతున్నారు;

Update: 2024-05-21 06:40 GMT

కొడవళ్లు.. కత్తులు... నాటు బాంబులు.. హత్యలు.. ప్రతీకార ఘర్షణలు.. తాడిపత్రి నియోజకవర్గం ఒకప్పుడు అట్టుడికిపోయేది. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎందరో అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. అలాంటి తాడిపత్రిలో మళ్లీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచినట్లే కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికలోనూ పేర్కొనడం గమనార్హం. తాడిపత్రి ఇక తగలపడిపోవాల్సిందేనా? కౌంటింగ్ తర్వాత కూడా అక్కడ ఘర్షణలకు ఫుల్ స్టాప్ పడతాయన్న నమ్మకం పోలీసు అధికారులకే కలగడం లేదంటే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇంటలిజెన్స్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. తాడిపత్రిలో తిరిగి ఘర్షణలు చెలరేగే అవకాశముందని హెచ్చరించాయి.

నాలుగు దశాబ్దాల నుంచి...
తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు ఈనాటివి కావు. గత నాలుగు దశాబ్దాల నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరిపై దాడులు జరగడం అక్కడ సహజం. అమాయకులు బలవుతున్నప్పటకీ తాము ఫలానానేత అనుచరుడిగా అనే చెప్పుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఫుడ్ నుంచి ఇంట్లో అవసరాలన్నీ నేతలే వారికి సమకూరుస్తుండటంతో ఇక ఉద్యోగాలకంటే నేతలకు ఊడిగం చేయడమే నయమన్న స్థితికి తాడిపత్రిలోని కొందరు యువకులు చేరిపోయారంటే అతిశయోక్తి కాదు. చివరకు ఈ ఘర్షణలలో బలయ్యేది వారే. అది తెలుసుకునే లోపే వారు జీవితం జైలులో ముగిసిపోవడమో.. లేక శాశ్వతంగా సమసిపోవడమో జరుగుతుంది.
అమాయకులు బలవుతున్నా...
ప్రధాన ప్రత్యర్థులుగా గతంలో జేసీ సోదరులతో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, పేరంనాగిరెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డిలు ఉండేవారు. 1994 నుంచి తాడిపత్రి రగులుతూనే ఉంది. నాడు పరిటాల రవి వర్గం పై చేయి సాధించి జేసీ వర్గం వెనక్కు తగ్గితే.. నేడు రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య యుద్ధంలో అమాయకులు బలవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దారెడ్డి గెలవడంతో జేసీ వర్గం సైలెంట్ కాలేదు. సరికదా.. పెద్దారెడ్డిపై కాలు దువ్వుతూనే ఉంది. ఇక పెద్దారెడ్డి కూడా సమయం కోసం వేచి ఉండి ఏకంగా జేసీ ఇంటిపైకే దాడికి వెళ్లాడంటే, ఆయన ఇంట్లోకి తన అనుచరులతో చొరబడ్డాడంటే పగ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ ఇద్దరే. ఎవరూ తక్కువ కాదు. మాటలతో రెచ్చగొట్టుకుంటూ టైం రాగానే దాడులు చేసుకోవడం తాడిపత్రిలో సాధారణంగా మారిపోయింది.
పోలీసులు కేసు నమోదు చేసినా...?
రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా రెండు నెలల్లో నేనేంటో చూపిస్తానంటూ పెద్దారెడ్డి సవాల్ విసిరాడంటే ఎంత పగతో రగలి పోతున్నాడో చెప్పాల్సిన పనిలేదు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన అడ్డా తాడిపత్రి అని భావిస్తూ పెద్దిరెడ్డి వర్గంపై పదే పదే కామెంట్స్ చేస్తూ కాలుదువ్వుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ వరకూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే పోలీసుల పహారా ఉంటుంది. అలాగే నేతలు కూడా కొంత అదుపులో ఉంటారు. కానీ ఫలితాల తర్వాత మాత్రం ఇద్దరినీ ఆపడం ఎవరి వల్ల అవుతుందన్నదే ఇప్పడు ప్రశ్న. సమయం కోసం కాచుక్కూర్చున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డిలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా వారిని ఎంత కాలం ఆపగలరు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఆ ఇద్దరిలో మార్పు రానంత వరకూ పోలీసులయినా.. ఎంత నిఖార్సయిన అధికారులయినా చేయగలిగిందేముంటుందన్న ప్రశ్న సహజంగానే వినిపిస్తుంది. అందుకే తాడిపత్రి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది.


Tags:    

Similar News