Ap Elections : జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తాయంటే? ఇది విన్నాక.. జనసైనికులు ఎగిరి గంతులేస్తారేమో?
శాసనసభలో ఈసారి మూడో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు
శాసనసభలో ఈసారి మూడో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా జనసైనికులకు సంతోషమే. పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన తర్వాత జనసేనకు ఈ అసెంబ్లీలో తొలిసారి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనాలు వినపడుతున్నాయి. వైసీపీ, టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. గత ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన జనసేన ఈసారి డబుల్ డిజిట్ కు చేరుకుంటుందన్న విశ్లేషణలు ఆ పార్టీ నేతల్లో ఆనందం నింపుతుంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి రెండంకెల సీట్లు రావడంతో పాటు తొలిసారి జనసేనాని పవన్ కల్యాణ‌్ కూడా శానససభలోకి కాలుమోపుతున్నారన్నారన్న సర్వేల ఫలితాలు మరింత జోష్ ను పెంచేశాయి.
జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత రెండు సార్లు మాత్రమే ఎన్నికలలో పోటీ పడింది. 2014 ఎన్నికల్లో జనసేన ఉన్నప్పటికీ అప్పుడు కూడా కూటమికి బయట నుంచి అంటే పోటీ చేయకుండా మద్దతివ్వడంతో ఆ ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో విభేదించి సొంత కూటమిని ఏర్పాటు చేసుకుని వెళ్లడంతో పవన్ కల్యాణ్ తో పాటు అందరూ ఓటమి పాలయ్యారు. కేవలం రాజోలు నుంచి మాత్రమే ఒకే ఒక్కరు గెలిచారు. అయితే ఈసారి కూటమిగా మరోసారి పోటీకి దిగడంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికలలో అసెంబ్లీలోకి ఠీవిగా అడుగుపెడుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
పోటీ చేసిన...
ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో బరిలోకి దిగింది. అయితే డబుల్ డిజిట్ రావచ్చన్న అంచనాలు ఆ పార్టీ అగ్రనేతల నుంచి వినిపిస్తున్నాయి. పది నుంచి పన్నెండు స్థానాలను కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంటే సగానికి సగం స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని వారు తమ అంతర్గత సర్వేల ద్వారా తెలిసిన విషయాన్ని పంచుకుంటున్నారు. ముఖ్యమైన నేతలందరూ విజయం బాట పడతారని వారి సర్వేల్లో వెల్లడయినట్లు తెలిసింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోనూ కొన్ని సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయంటున్నారు.
పిఠాపురంలో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వాళ్లు ఆశించిన మెజారిటీ రాకపోయినా గౌరవప్రదమైన ఓట్లతో బయటపడతామని సర్వేలో తేలిందట. వంగా గీత నుంచి కూడా గట్ట ి పోటీ ఇవ్వడంతో తాము తొలి నుంచి చెప్పిన మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయని, అయితే పవన్ కల్యాణ‌్ విజయం ఖాయమని నేతలు చెబుతున్నారు. పిఠాపురం శాసనసభ్యుడిగా పవన్ శాసనసభలోకి సగర్వంగా అడుగు పెడతారని అంటున్నారు. ఇలా పవన్ తో పాటు మరికొందరు పార్టీలోని కీలక నేతలు కూడా గెలుపు బాటలో పయనిస్తారని సర్వేలు తేలడంతో జనసేన పార్టీలో ఉత్సాహం నెలకొంది. అయితే ఇది వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి తమ ఏజెంట్ల నుంచి తెప్పించుకున్న సమాచారంతో పాటు, కొన్ని సర్వే సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఈ విషయం బయటపడిందంటున్నారు. మరి జూన్ 4వతేదీ తర్వాత గాని ఎన్ని స్థానాల్లో జనసేన గెలుస్తుందన్నది చెప్పలేం.