Narendra Modi : జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రి, అనకాపల్లి సభల్లో ప్రసంగించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మోదీ జగన్ ప్రభుత్వంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిని అత్యంత వేగంగా పరుగులు పెట్టించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వందశాతం అవినీతి ఉందన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీని తిరస్కరిస్తారని నరేంద్ర మోదీ అన్నారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు ఖచ్చితంగా ఎన్టీఏ ప్రభుత్వం ఉండాలని అన్నారు.
అప్పుల ఊబిలోకి...
ప్రభుత్వాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ సర్కార్ ను దించేయాలని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఏపీలో యువశక్తి అమోఘమని, దానిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిందన్నారు. దేశంతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని నరేంద్ర మోదీ కోరారు. ప్రస్తుతమున్న ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యంచేసిందన్నారు. కాంగ్రెస్, వైసీపీ రెండూ ఒక్కటేనేని అన్నారు. రెండూ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుని మరింత అధ్వాన్నంగా మార్చిందన్నారు.
మూడు రాజధానుల పేరిట...
మూడు రాజధానుల పేరు చెప్పిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచారన్న మోదీ పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే ఆ ప్రాజెక్టును నిలిపేసిందన్నారు. అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇవ్వాలనుకున్నామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని స్వీకరించలేకపోయిందని మోదీ అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అనకాపల్లి సభలో నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వంతో పాటు పవన్ కల్యాణ్ విశ్వాసం ఉన్నాయన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.