BJP : ఏపీ బీజేపీలో కొత్త సమీకరణాలు.. ఇక ఆ నేతలకు ఫ్యూచర్ నిల్ అని చెప్పేసినట్లేనా?

కూటమి ఏర్పాటు కాకముందు వరకూ పార్టీలో చురుగ్గా కనిపించిన సీనియర్ నేతలు మాత్రం తర్వాత పెద్దగా కనిపించడం లేదు

Update: 2024-05-21 12:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. కూటమి ఏర్పాటు కాకముందు వరకూ ఉన్ననేతలు ఆ తర్వాత కనిపించ కుండా పోయారు. ముఖ్యంగా ఏపీలో ఈసారి గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పాటయిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ఏర్పాటు కాకముందు వరకూ పార్టీలో చురుగ్గా కనిపించిన సీనియర్ నేతలు మాత్రం తర్వాత పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనూ, ప్రచారంలోనూ, ముఖ్యనేతలు వచ్చినప్పుడు కూడా వారి మొహం కనిపించలేదు. కానీ వీరంతా తొలి నుంచి బీజేపీలో ఉన్నవాళ్లే. ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న నేతలే. కానీ చివరకు కూటమి ఏర్పాటుతో వీరు కనిపించకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సిద్ధాంతాలను...
సాధారణంగా ఇతర పార్టీల కంటే బీజేపీ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సిద్ధాంతాలను నమ్ముతారు. ఆర్ఎస్ఎస్ భావాజాలన్ని పుణికి పుచ్చుకుని వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. అభ్యర్థులు ఎవరన్నది వారికి ముఖ్యం కాదు. పార్టీని బలోపేతంచేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వారి ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. పార్టీ జెండాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అందులోనూ లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇంట్లో తిష్టవేసి కూర్చోరు. కాలికి బలపం కట్టుకుని తిరుగుతారు. జయాపజయాలు వారికి ముఖ్యం కాదు. కానీ పార్టీకితాము ఎంత వరకూ ఉపయోగపడ్డామన్నదే ఆలోచిస్తారు.
ప్రచారానికి దూరంగా....
అలాంటి వారు మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు దూరంగా ఉన్నారు. సోము వీర్రాజు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీతో చెలిమి ఆయనకు ఇష‌్టం లేదు. అలాగని అధినాయకత్వం నిర్ణయాన్ని ఎదిరించలేదు. సానుకూలంగా స్వాగతించారు. కానీ ఈ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాలను ఎంచుకున్న తీరు వంటి విషయాల్లో మనస్థాపం చెందిన సోము వీర్రాజు ఈ ఎన్నికల ప్రచారంలో దూరంగానే ఉన్నట్లు కనిపించారు. రాజమండ్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి పోటీ చేసినా ఆయన పెద్దగా యాక్టివ్ గా లేకపోవడానికి కారణం అసంతృప్తి అని చెప్పకతప్పదు. సోము వీర్రాజు వాయిస్ ఎన్నికల సమయంలో వినిపించకపోవడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది.
టిక్కెట్ దక్కకపోవడంతో...
మరోనేత వి‌ష్ణువర్ధన్ రెడ్డి .. ఈయన కూడా తొలి నుంచి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు. కదిరి నియోజకవర్గానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి టిక్కెట్ ఆశించినా ఈసారి ఎన్నికల్లో దక్కలేదు. ఆయన హిందూపురం స్థానం నుంచి పోటీచేయాలని భావించారు. కానీ టిక్కెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఒక దశలో టీడీపీ, జనసేన మ్యానిఫేస్టోతో తమకు సంబంధం లేదని చెప్పారు. మరో నేత జీవీఎల్ నరసింహారావు కూడా దాదాపుగా అంతే. మొన్నటి వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన విశాఖ టిక్కెట్ ను ఆశించారు. కానీ దక్కకపోవడంతో విశాఖలోని ఒక నియోజకవర్గంలో ప్రచారానికే పరిమితి అయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా సభలకు కూడా వీరు దూరంగా ఉండటంతో కమలం పార్టీ తీసుకున్న నిర్ణయాలతో వీరు ఏకీభవించడం లేదని చెప్పకనే తెలుస్తోంది.
Tags:    

Similar News