TDP : చావోరేవో.. తేల్చుకునేందుకు సిద్ధం.. ఎక్కడో భయం.. అదే సమయంలో ధైర్యం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈసారి ఎన్నికలు చావోరేవో సమస్య. అందుకే ఈ ఎన్నికను ఆయన సవాల్ గా తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈసారి ఎన్నికలు చావోరేవో సమస్య. ఆయన అధికారంలోకి వస్తేనే పార్టీ మనుగడ ఉంటుంది. లేకుంటే పొరుగున ఉన్న బీఆర్ఎస్ పరిస్థితికి ఏ మాత్రం తీసిపోదు. అది ఆయనకు తెలుసు. వయసు రీత్యా చంద్రబాబు కూడా ఇక ఐదేళ్లలో పార్టీని బలోపేతం చేసే అవకాశముండదు. మరో వైపు ఇది ఆఖరి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు గెలవకుంటే.. ప్రజలు టీడీపీని సుదీర్ఘకాలం ఆదరించారన్న భయం కూడా పార్టీ నేతల్లో నెలకొంది. అందుకే ఈ ఎన్నికల్లో డూ ఆర్ డై లా చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా పోరాడాల్సి ఉంటుందన్నది అందరూ అంగీకరించే విషయమే.
బలమైన పార్టీలు కలసి...
ఏపీలో ప్రస్తుతం కూటమి ఏర్పడింది. టీడీపీ బలమైన పార్టీ. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పటిష్టమైన క్యాడర్ ఉన్న పార్టీ. దశాబ్దాలుగా ప్రజల్లో ఉండటమే కాకుండా అధికారంలో కూడా ఎక్కువ సార్లు ఉన్న జెండా అది. దీనికి తోడు బలమైన సామాజికవర్గం, ఏపీలో అత్యధిక సామాజికవర్గం కాపు ఓటర్లు మద్దతు ఉందని భావిస్తున్న జనసేన కూడా మిత్రపక్షంగా ఉంది. కేవలం పవన్ కల్యాణ్ సినీ హీరోనే కాకుండా కులం పరంగా ఓట్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావడమే కాకుండా క్రౌడ్ పుల్లర్ గా పేరుంది. ఈ ఇద్దరికి తోడు మోదీ చరిష్మా ఉండనే ఉంది. అయోధ్య ఆలయ నిర్మాణంతో మరింత పీక్స్ కు చేరుకుంది. దీంతో ముగ్గురు కలసి మళ్లీ పోటీ చేస్తున్నారు.
ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేసి విజయం సాధిస్తే ఓకే. ఎందుకంటే 2014 రిజల్ట్ రిపీట్ అయ్యానని చెప్పుకునే వీలుంది. అలా కాకుండా ఏమాత్రం తేడా కొట్టినా ఇక కూటమి కట్టినా జనం ఆదరించలేదన్న అభిప్రాయం బలంగా పడుతుంది. ఇతర పార్టీలు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకూ ఆయన చాణక్యుడని, ఆయన వ్యూహాలకు తిరుగులేదని క్యాడర్ నుంచి నేతల వరకూ నమ్ముతున్నారు. ఈసారి కూటమి విఫలమయితే మాత్రం క్యాడర్ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే చంద్రబాబుకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య. ఏ అవకాశాన్ని చేజార్చుకోకుండా జగన్ పార్టీని దెబ్బకొట్టేందుకు జెండాలన్నింటినీ కలిపి మరీ బరిలోకి దిగుతున్నారు.
సభలో అడుగుపెట్టనుంటూ...
మరోవైపు అతి పెద్ద ఇబ్బంది ఆయన శపథం. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెడతానని శపథం చేసి మరీ శాసనసభ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత శాసనసభ గడప తొక్కలేదు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా సభలోకి అడుగుపెట్టే అవకాశముంటుంది. అది జరగకుంటే మాత్రం ఆయన సభకు కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు టీడీపీ అభిమానుల్లో అదే ఆందోళన నెలకొని ఉంది. శపథం నెరవేరాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందే. అందుకు కార్యకర్తలు చెమటోడ్చాల్సిందే. ఇన్ని కారణాలు ఇప్పుడు టీడీపీ క్యాడర్ ను, అభిమానులు వేధిస్తున్నాయి. మరి ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.