Andhra Pradesh Elections : మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కల్యాణ్.. దీనిని ఎవరైనా కాదంటారా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి దూసుకు రావడానికి అనేక కారణాలున్నాయి

Update: 2024-06-04 05:24 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి దూసుకు రావడానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత కొంతయితే.. ఎక్కువ శాతం మాత్రం విన్ కావడానికి పవన్ కల్యాణ్ కారణమని చెప్పక తప్పదు. జగన్ పై తొలి నుంచి కాలుదువ్వుతూ కలహానికి సై అంటూ.. జనంలో జగన్ పట్ల జనంలో వ్యతిరేకత మొదలవ్వడానికి ఆద్యుడు పవన్ కల్యాణ్ అని చెప్పకతప్పదు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటింది. ఆయన ఇంతవరకూ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒకే ఒక స్థానంలో గత ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ పదేళ్లలో వందేళ్లకు సరిపడా అనుభవాన్ని సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలను వడబట్టి.. దానిని ఒలికిపోకుండా కాపాడుతూ ఇంత దూరం తీసుకు వచ్చి జగన్ ను అధికారానికి దూరం చేశారంటే అందుకు కారణం ఆయనే. అందులో ఏమాత్రం సందేహం లేదు.

Full Viewగత ఎన్నికల ఫలితాలు...
జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ధ్వేషం లేదంటాడు పవన్. అదే సమయంలో జగన్ అధికారంలో ఉండటాన్ని మాత్రం 2019 ఎన్నికల ఫలితాల నుంచి ఆయన తట్టుకోలేకపోయారు. అందుకే ఏమీ ఆలోచించకుండా ఆయన తాను వ్యతిరేకించిన బీజేపీతో ఐదేళ్ల క్రితమే చేతులు కలిపారు. బీజేపీ పెద్దలయిన మోదీ, అమిత్ షాతో మంచి సంబంధాలు నెరుపుతూ వచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలను పట్టించుకోలేదు. అవమానాలు, వ్యక్తిగత విమర్శలు దిగమింగి జగన్ ను ఓడించడం ఏకైక లక్ష్యంగా పనిచేశారు. నిజానికి జనసేన ఏర్పడి పదేళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీకి క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు ఉంది. బలమైన నేతలు కూడా పట్టుమని పది మంది కూడా లేరు. ఆ సంగతి ఆయన బయటకు చెప్పడానికి కూడా వెనుకాడరు. అసలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు.
వ్యతిరేక ఓటు...
జగన్ ను ఓడించాలంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించారు. తన సామాజికవర్గమైన కాపులను ఏకం చేయడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అసలు పొత్తు ఉందని రాజమండ్రి జైలు బయటే ఆయన ప్రకటించి అందరి చేత విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ లెక్క పెట్టలేదు. అరవై సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని వచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టారు. తన బలమెంతో తనకు తెలుసునని, తనకు ఒక వ్యూహం ఉందంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చివరకు 21 స్థానాలకే పరిమితమయ్యారు. రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. ఇక టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని దగ్గరకు చేర్చడంలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. ఢిల్లీకి వెళ్లి మరీ పెద్దలను ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. తనను ఎన్ని మాటలయినా అనండి.. కానీ రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు తప్పదని వారిని ఒప్పించి మెప్పించి మరీ కూటమి గెలుపునకు కారణమయ్యారు.
కూటమి ఏర్పాటకు...
అందుకే పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పవన్ అనే పాత్ర లేకపోతే కూటమి అనే సినిమా హిట్ అయ్యేది కాదు. మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చేది. కానీ కసితో ఊగిపోతున్నట్లు పైకి కనిపించినా అన్నింటా తలవంచుతూ ఆయన డైలాగులో చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన లీడర్ పవన్ కల్యాణ్ అని చెప్పక తప్పదు. తాను ఈసారి రెండు చోట్ల పోటీ చేసి మరోసారి ఓటమి కాకూడదని తీసుకున్న నిర్ణయం కూడా ఆయన పొలిటికల్ హీరోను చేసిందనే చెప్పాలి. అలా పవన్ కల్యాణ్ కూటమి ఏర్పడటానికి ప్రధాన భూమిక పోషించి తొలిసారి అత్యధిక స్థానాలతో జనసేన ను శాసనసభలోకి పంపగలిగారంటే అతి పవన్ కల్యాణ్ వ్యూహమని చెప్పకతప్పదు. అందుకే పవన్ లేకపోతే ఈ ఎన్నికలు లేవు. ఇంత కిక్కు కూడా వచ్చేది కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


Tags:    

Similar News