Ap Elections : బాలయ్యకు ఈసారి గట్టి పోటీ ఎదురైందా? అందుకు ఈ లెక్కలే చెబుతున్నాయా?

హిందూపురం నియోజకవర్గంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుండటమే

Update: 2024-05-19 07:56 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో పదిహేను రోజులు సమయం ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే అనేక రకాల విశ్లేషణలు ఏపీ రాజకీయాలపై వెలువడుతున్నాయి. ప్రధానంగా హాట్ సీట్లు ఏపీలో అనేకం ఉన్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు కూటమి పార్టీల్లో అగ్రనేతలు ఎన్నికల బరిలో నిలిచారు. సహజంగా వారు పోటీ చేసే స్థానాలపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఫలితాలు ఎలా వచ్చినా సరే అంచనాలు మాత్రం ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పోలింగ్ శాతం తో పాటు ఓటింగ్ కు హాజరయిన ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

Full Viewటీడీపీకి కంచుకోటగా...
అన్నింటికంటే ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుండటమే. హిందూపురానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో టీడీపీ జెండా తప్ప మరే జెండా ఎగరలేదు. మరో నియోజకవర్గంలో టీడీపీకి ఇంత హిస్టరీ లేదు. 1983, 1985, 1989, 1994, 1996 ఉప ఎన్నిక, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వరస విజయాలను సాధించింది. రాష్ఠ్రంలో ఎంత గాలి వీచినా సరే హిందూపురంలో టీడీపీ జెండాను ఎగరకుండా అటు వైఎస్, ఇటు జగన్ ఆపలేకపోయారు.
నందమూరి కుటుంబానికి...
అందులోనూ నందమూరి కుటుంబం నుంచి ముగ్గురు ఇక్కడి నుంచి పోటీ చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 1985, 1989, 1994లలో పోటీ చేసి విజయం సాధించారు. 1996 ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఎదురులేకుండా గెలిచి ఇంటిపేరును హిందూపురంలో నిలబెట్టారు. హ్యాట్రిక్ విజయం కోసం నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగారు. అయితే ఈసారి బాలకృష్ణ తన విజయం పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవడం లేదు. తనకు హిందూపురం ప్రజలు అండగా ఉంటారని భావిస్తున్నారు.
వైసీపీ నుంచి ఈసారి...
కానీ ఈసారి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. బీసీ వర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయణ్ దీపికను వైసీపీ బరిలోకి దింపింది. దీంతో పాటు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి బరిలోకి దిగారు. దీంతోనే కొంత టీడీపీ ఓట్లకు గండిపడతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓటు బ్యాంకు ఎటూ ఉండనే ఉంటుందని, కానీ టీడీపీ ఓటు బ్యాంకులోని హిందువులలో కొందరు, టీడీపీ సానుభూతిపరులు మరికొందరు స్వామీజీ వైపు మొగ్గు చూపారన్న వార్తలు కొంత టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయి. అయితే ఏ స్థాయిలో ఓట్లు చీల్చుకున్నా నందమూరి బాలకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరన్నది టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి చివరకు బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? లేక హిందూపురం హిస్టరీని చెరిపేస్తారా? అన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది.


Tags:    

Similar News