Ap Elections : గోదారి ఆశలు గల్లంతయినట్లేనా.. అనుకున్న ప్లాన్ వర్క్‌ అవుట్ కాలేదా?

ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే అధికారం వస్తుంది

Update: 2024-05-15 08:09 GMT

ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే అధికారం వస్తుంది. కొన్ని దఫాల నుంచి ఇదే జరుగుతుంది. అందుకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టు కోసం అన్ని పార్టీలూ ప్రయత్నిస్తాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 34 స్థానాలున్నాయి. అయితే ఇందులో అత్యధికంగా స్థానాలను గెలుచుకోవాలని టీడీపీీ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్లింది. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి ఈసారి జరగకూడదని భావించి అక్కడ ప్రధాన సామాజికవర్గమైన కాపులను తమ వైపునకు తిప్పుకునేందుకు జనసేన పార్టీని అక్కున చేర్చుకుంది. ఎలక్షనీరింగ్ సక్రమంగా చేయడం కోసం బీజేపీని కౌగిలించుకుంది.

స్వీప్ చేద్దామని అనుకుంటే...
తూర్పు గోదావరి జిల్లాలో జనసేనతో పొత్తుతో 19 స్థానాల్లో కనీసం పదిహేను స్థానాలను సాధించాలని భావించింది. అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలకు అక్కడ పార్లమెంటు స్థానంతో పాటుగా శాసనసభ స్థానాలను ఇచ్చింది. కేవలం అత్యధిక స్థానాలను గెలుచుకోవడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నించింది. అయితే టీడీపీ ఊహించిన స్థాయిలో ఓట్ల బదిలీ అనేది జరగలేదన్న సమాచారం టీడీపీ నేతలకు ఊపిరి సలవనివ్వడం లేదు. ముఖ్యమైన స్థానాల్లోనూ వైసీపీ చివరి నిమిషంలో పోటీ కి దూసుకు రావడంతో అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో దిగులు పట్టుకుంది.
సోషల్ ఇంజినీరింగ్...
ప్రధానంగా రెండు జిల్లాల్లో జగన్ చేసిన సోషల్ ఇంజినీరింగ్ మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. ప్రధానంగా శెట్టి బలిజలకు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించడంతో పాటు శెట్టి బలిజలకు అసెంబ్లీ స్థానాలు అధికంగా ఇవ్వడం, అలాగే టీడీపీ కంటే కాపులకు అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడంతో కొంత ఓట్లను టీడీపీ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అనేక నియోజకవర్గాల్లో శెట్టి బలిజలు 80 శాతానికి పైగానే ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కారంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీ అంచనాలు అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదంటున్నారు. ముఖ్యంగా టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ నుంచి ఓట్లు బదిలీ కాలేదని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు పన్నెండు సాధించాలనుకున్న టీడీపీకి ప్లాన్ ఎలక్షనీరింగ్ లో ఫెయిలందన్న వార్తలు కొంత నిరాశను కలిగిస్తున్నాయి.
కొంత తగ్గినా...?
ఈ రెండు జిల్లాల్లో గతం కంటే వైసీపీకి కొంత సీట్లు తగ్గినా అనుకున్న స్థాయిలో డ్యామేజీ జరగలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు ప్రధానంగా మైనారిటీలు వన్ సైడ్ గా వైసీపీ వైపు నిలబడటంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో అత్యధిక శాతం అండగా ఉన్నారన్న వార్తలు ఆ పార్టీకి ఊపిరి నిచ్చేలా ఉన్నాయి. రాయలసీమలో ఎలాతమను కొట్టేవారు లేరనుకుంటున్న వైసీపీకి ఎన్నికల ముందు వరకూ ఉభయ గోదావరి జిల్లాలపైనే కొంత డౌట్ ఉండేది. కానీ పోలింగ్ తర్వాత సరళిని చూసిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందంటున్నారు. జనసేనకు మద్దతుగా నిలుస్తారన్న కాపు సామాజికవర్గం ఓటర్లలోనూ అనేక నియోజకవర్గాల్లో చీలిక రావడంతో తాము ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. మహిళలు పెద్దయెత్తున తరలి రావడం కూడా తమకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎటు చూసుకున్నా తమకు అనువైన వాతావరణం ఎన్నికల మైదానంలో ఉందన్నది వైసీపీ నేతల వాదన. మరి ఫలితాలు తెలిసే జూన్ 4వ తేదీ వరకూ ఓపిక పట్టాల్సిందే.


Tags:    

Similar News