Ap Politics : కుప్పం ఎవరికి అక్కుం.. బక్కుం.. ఇన్ని ఓట్ల పోలయితే ఎవరిని దెబ్బేయనుందో తెలుసా?

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈసారి ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది

Update: 2024-05-15 05:50 GMT

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈసారి ఓడిస్తామని వైసీపీ శపథం చేసింది. అలాగే లక్షకు పైగా మెజారిటీతో కుప్పంలో ఈసారి గెలుస్తానని చంద్రబాబు ప్రతిన బూనారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అందుకే కుప్పంలో మెజారిటీపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అందుకే కుప్పం నియోజకవర్గం వైపు అందరి చూపు ఉంది. చంద్రబాబుకు వచ్చే మెజారిటీ ఎంత? అన్న దానిపై టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొండగా, ఈసారి కుప్పం కోటను ఛేదిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఎవరికి అడ్వాంటేజీ అన్నది తేలకుండా ఉంది.

అడ్డా అయిన చోట...
కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు అడ్డా. ఆయన ఏడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈసారి గెలిస్తే రికార్డు స్థాయిలో వేరెవరూ వరసగా గెలవనన్ని సార్లు చంద్రబాబు గెలిచి రికార్డు సృష్టించినట్లే అవుతుంది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచారు. చంద్రబాబు ఇన్ని సార్లు గెలిచినా గత ఎన్నికల్లో మాత్రం ఆయన మెజారిటీ తగ్గింది. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రత్యర్థి కంటే యాభై వేల మెజారిటీతో గెలుస్తుంటారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మీద కేవలం 30 వేల మెజారిటీతోనే విజయం సాధించారు.
ఫోకస్ పెట్టిన వైసీపీ...
అందువల్లనే వైసీపీ కుప్పంలో చంద్రబాబును ఎందుకు ఓడించలేమని తొలి నుంచి అక్కడ ఫోకస్ పెట్టింది. చంద్రమౌళి కుమారుడు భరత్ ను వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేసింది. కుప్పం నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించింది. కుప్పం ను రెవెన్యూ డివిజన్ ను చేసింది. హంద్రీనీవా నీళ్లను తెచ్చామని చెప్పుకుని ఈ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే చంద్రబాబు మాత్రం కుప్పం ప్రజలపై పూర్తిగా విశ్వాసం ఉంచారు. ఎన్నికల సమయంలో పెద్దగా కుప్పంలో ప్రచారం కూడా ఆయన చేయలేదు. అంత కాన్ఫిడెన్స్ తో ఆయన ఉన్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు వచ్చిన పోలింగ్ శాతం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ ఇంత స్థాయిలో పోలింగ్ జరగకపోవడంతో ఎవరికి వారే తమదే గెలుపు అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు.
అత్యధిక శాతం పోలింగ్...
కుప్పం నియోజకవర్గంలో దాదాపు 2.20 లక్షల మందికిపైగా ఓటర్లు ఉండగా అందులో 89.88 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తేలింది. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదయింది. ఇప్పుడు ఈ ఓటింగ్ శాతంపైనే పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధితో పాటు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో ఆయన గెలుపునకు ఢోకా లేదని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అయితే అదే సమయంలో పథకాలు, అభివృద్ధి తమను ఈసారి గెలిపించి తీరతాయన్న నమ్మకంతో వైసీీపీ ఉంది. మొత్తం మీద కుప్పంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎవరిని గెలిపించడానికి ఓటర్లు క్యూ కట్టారన్నది జూన్ 4వ తేదీన తెలియనుంది. అప్పటి వరకూ కుప్పం పై మాత్రం చర్చలు నడుస్తూనే ఉంటాయి.


Tags:    

Similar News