Ap Elections : ఎటు చూసినా గెలుపు మాదేనంటున్న ఫ్యాన్ పార్టీ నేతలు.. బాబుకు బొమ్మ కనపడుతుందంటున్న లీడర్లు
వైసీపీ నేతలు కూడా గెలుపు పై ధీమాగా ఉన్నారు. ఏ రకంగా చూసినా జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు
వైసీపీ నేతలు కూడా గెలుపు పై ధీమాగా ఉన్నారు. ఏ రకంగా చూసినా జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. వాళ్ల నమ్మకం ఒక్కటే. పథకాలు.. నగదు బదిలీ. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చిన విధానం.. ఇలా అన్నీ తమకు ప్లస్ అవుతాయన్న అంచనాల్లో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు. వైఎస్ జగన్ జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటున్నారు. అదీ విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా చెబుతున్నారు. అధికారులు తమకు సహకరించకపోయినా ప్రజలు పెద్దయెత్తున ఆశీర్వాదం అందించారని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ల్యాండ్ స్లయిడ్ విక్టరీ ఖాయమని నమ్ముతున్నారు. జగన్ కేవలం ఐ ప్యాక్ సర్వే మీదనే ఆధారపడి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పలేదని, ఆరేడు రకాల సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాతనే ఆ ప్రకటన చేశారంటున్నారు.
ఒక రాజకీయ విశ్లేషకుడి మాటలలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు క్యాస్ట్ బలంగా పనిచేసేది. కానీ మొన్నటి ఎన్నికల్లో అది పనిచేసినట్లు కనిపించలేదని ఆయన చెప్పడం వెనక కూడా కొంత అర్థముుంది. రెడ్డి సామాజికవర్గం ప్రజలు గంపగుత్తగా వైసీపీకి ఓట్లు వేయకపోవచ్చు. అదే సమయంలో కమ్మ సామాజికవర్గం నుంచి కూడా కనిష్ట స్థాయిలోనైనా ఓట్లు పడే అవకాశముందని చెప్పారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు బలంగా వైసీపీ వైపు నిలిచారన్నది ఆయన అంచనా. వారు చంద్రబాబుకు ఓటు వేయడానికి కారణాలు లేవని, జగన్ కు ఓటు వేయడానికి మాత్రం బలమైన కారణాలున్నాయని చెప్పడం కూడా వాస్తవమేనని అనిపించక మానదు. అంత భారీ స్థాయిలో పోలింగ్ జరగడానికి కూడా కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని, ఈ ప్రభుత్వం రావాలని కోరుకోవడం వల్లే అంత పెద్దయెత్తున పోలింగ్ ప్రజలు తరలివచ్చారని చెబుతున్నారు.
ఓటు బ్యాంకు అంతా...
ఇక మహిళల్లో ఎనభై శాతం మంది తమ వైపు మొగ్గు చూపారన్నది కూడా వైసీపీ నేతలు చెబుతున్న లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువగా జగన్ మహిళల ఖాతాల్లో నగదును బదిలీచేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా నగదును మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు జగన్ మరోసారి అధికారంలోకి రాకుంటే తమకు కుటుంబంలో విలువ తగ్గిపోతుందని కూడా ఆలోచించి వన్ సైడ్ గా ఓటు వేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. చంద్రబాబు వస్తే తమకు ఈస్థాయిలో నగదు రాదన్న అపనమ్మకం కూడా పోలింగ్ కేంద్రాల వైపునకు పరుగులు తీయించేలా చేసిందన్న అంచనాల్లో వైసీపీ నేతలున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పెద్దయెత్తున ఓటింగ్ తమకు అనుకూలంగా వేశారని కూడా చెబుతున్నారు. కులాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా తమకు వన్ సైడ్ గా ఓట్లు పడ్డాయన్న ధీమాతో వైసీపీ నేతలున్నారు. అందుకే తమ పార్టీ అధినేత అంత ధీమాగా ఉన్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
లోకల్ సర్వే సంస్థలు కూడా...
ఇక లోకల్ సంస్థలు కూడా తమ సర్వేల్లో ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గుచూపేలా వచ్చిందని చెబుతున్నారు. ట్రాక్ రికార్డున్న లోకల్ సంస్థలు దాదాపుగా ఎక్కువ శాతం వైసీపీ వైపు మొగ్గు చూపడం కూడా ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండటానికి కారణమని చెబుతున్నారు. బెజవాడలో మాజీ పార్లమెంటు సభ్యుడు సోదరుడు చేయించిన సర్వేలోనూ వైసీపీకి 130 స్థానాలకు పైగా వస్తాయని చెప్పారని, ఇది చాలదా? తమ విజయం తధ్యమని చెప్పడానికి అంటూ వాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. 175 సీట్లలో 89 సీట్లు వస్తే ఎవరికైనా అధికారమే. కానీ వైసీపీ మాత్రం ఈసారి గతం కంటే అధికంగా వస్తాయని చెబుతున్నప్పటికీ ఎక్కువ సర్వే సంస్థలు మాత్రం వంద నుంచి 120 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని కూడా ముందుగానే చెప్పేశాయంటున్నారు. ఇలా వైసీపీ కూడా ఫుల్లు కాన్ఫిడెన్స్ తోనే ఉంది.లాండ్ స్లైడ్ విక్టరీ గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పోస్టింగ్ లు పెడుతుండటం గమనార్హం.