YSRCP : వైసీపీకి కూసాలు కదులుతున్నాయ్.. తలకిందులుగా తపస్సు చేసినా గెలవదట
వైసీపీ పర్చూరు నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఉండరంటారు. ఇప్పుడు ఈ ఫార్ములానే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరులోనూ కనిపిస్తోంది. ఇక్కడ రాజకీయంగా గత ఏడాది ఒకరిపై ఒకరు పోటీ చేశారు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఏలూరి సాంబశివరావు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. అప్పట్లో దగ్గుబాటి వైసీపీలో ఉన్నారు. దీంతో ఆయన ఆ టికెట్‌పై పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఆ తర్వాత.. రాజకీయంగా ఆయన దూరంగా ఉన్నారు. ఇక, టీడీపీ నేత ఏలూరి.. 2014, 2019లోనూ ఇక్కడ విజయం దక్కించుకున్నారు. 2019లో వైసీపీ హవా.. జగన్ పాదయాత్ర ప్రభావం ఉన్నా.. ఏలూరి సాంబశివరావు గెలుపు గుర్రం ఎక్కారు.
పార్టీనే నమ్ముకుని ఉన్న...
మధ్యలో వైసీపీ నుంచి ఆయనకు అనేక ఆఫర్లు వచ్చినా.. పార్టీనే నమ్ముకుని, ప్రజల కోసం అలా ఉండిపోయారు. ఇక. ఇప్పుడు వైసీపీ పర్చూరులో ఏలూరిని ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అయితే.. వైసీపీకి ఇది సాధ్యమయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఏలూరిపై పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏలూరికి సహకరిస్తున్నారు. ఎందుకంటే.. వైసీపీ దగ్గుబాటి కుటుంబానికి అన్యాయం చేసిందనే వాదన ఆ కుటుంబం నుంచి వినిపి స్తోంది. పార్టీ తరఫున పోటీ చేసి.. రూ.10 కోట్లకుపైగా గత ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత.. పార్టీ నుంచి కనీసం సానుభూతి దక్కలేదని.. దగ్గుబాటి ఓ సందర్భంలో వెల్లడించారు.
అంతేకాదు.. వైసీపీ విధానాలను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పాలనలో తాను గెలవకపోవడమే మంచిదైందని కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న వారిలో దగ్గుబాటి కుటుంబం కూడా ఒకటి. ఎలానూ దగ్గుబాటి ప్రస్తుత ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. దీంతో స్థానికంగా వైసీపీ గెలిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగక పోగా.. రాజకీయంగా కూడా ఇబ్బందులు వస్తాయని అంచనా వేసుకున్న వెంకటేశ్వరరావు.. పరోక్షంగా ఏలూరిని గెలిపించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తనపై గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరికి నైతిక మద్దతు తెలుపుతున్నారు.
కూటమి అభ్యర్థి కావడంతో...
నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా తన అనుచరులు, సన్నిహితులకు ఫోన్లు చేసి.. ఏలూరికి మద్దతు ప్రకటించాలని కోరుతుండడంతో పాటు.. అంతర్గత సమావేశాలు పెట్టి మరీ కూటమిని గెలిపించాలని పట్టుబడుతున్నారు. ఈ కూటమిలో బీజేపీ కూడా.. ఉండడం, ఆ పార్టీకి తన సతీమణి పురందేశ్వరి.. చీఫ్‌గా ఉండడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏలూరి వైపు మొగ్గు చూపుతున్నారనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. దీంతో వైసీపీ ఈ నియోజకవర్గంలో తలకిందులు తపస్సు చేసినా.. గెలిచే పరిస్థితి ఉండదని అంటున్నారు పరిశీలకులు. జగన్ పథకాలు ఇక్కడ మాత్రం జాన్తా నై అంటున్నారు. అక్కడ మరోమారు పసుపు జెండా ఖాయమన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద పర్చూరు ఎన్నిక ఈసారి మాత్ర ఏకపక్షంగా జరుగుతుందన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది.