అమ్మా నన్ను క్షమించు.. బాసర IIITలో మరో విద్యార్థి బలవన్మరణం
సమాచారం అందుకున్న పోలీసులు..భాను ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి
బాసర IIITలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి తన హాస్టల్ గదిలో భానుప్రసాద్ అనే విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఇటీవలే మంత్రి కేటీఆర్ క్యాంపస్ లో పర్యటించి.. విద్యార్థుల ఆందోళనలను కాస్త కుదుటపడేలా చేశారనుకునేలోపే.. మరో విద్యార్థి చనిపోవడం ఆందోళన రేపింది. పీయూసీ 2 చదువుతోన్న భానుప్రసాద్ సూసైడ్ నోట్ రాసి.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు..భాను ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ లో భాను ప్రసాద్.. అమ్మా నన్ను క్షమించు. నాకు చదువుపై శ్రద్ధ కలగడం లేదు. తీవ్రమైన ఒత్తిడి, కఠిన నిబంధనల కారణంగానే చనిపోతున్నానని రాసినట్లు తెలుస్తోంది. కానీ.. భానుప్రసాద్ బలవన్మరణానికి కారణం వ్యక్తిగత కారణాలేనని వీసీ చెబుతున్నారు.
కాగా..భాను ప్రసాద్ గతంలోని ఆత్మహత్యాయత్నం చేయగా.. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. భానుప్రసాద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా రంగాపురం. విద్యార్థి బలవన్మరణంతో స్టూడెంట్స్ అంతా కలిసి అడ్మినిస్ట్రేటివ్ ముందు నిరసనకు దిగారు. భానుప్రసాద్ సూసైడ్ నోట్ ను బయటపెట్టాలని ఆందోళన చేస్తున్నారు. గడిచిన నాలుగు నెలల్లో బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడ్డారు.