ట్రైన్ లో సీటు కోసం మహిళల గొడవ.. పోలీసుకు కూడా గాయాలే..!

మహిళల మధ్య ఇంత పెద్ద గొడవకు కారణం ట్రైన్ లో సీటు గురించే అని

Update: 2022-10-07 02:04 GMT

ముంబై సబర్బన్ రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మహిళల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కొంతమంది మహిళలు డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును కూడా గాయపరిచారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు.

వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) ఇన్స్పెక్టర్ శంభాజీ కటారే మాట్లాడుతూ మహిళల మధ్య ఇంత పెద్ద గొడవకు కారణం ట్రైన్ లో సీటు గురించే అని తెలిపారు. ఈ గొడవ ట్రిగ్గర్ తుర్భే స్టేషన్ సమీపంలో సీటు విషయంలో జరిగిందని.. ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. వీడియోలో, కొంతమంది మహిళా ప్రయాణీకులు తమకెలాంటి గాయాలు అవ్వకుండా పక్కకు వెళ్లిపోవడం చూడవచ్చు. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకున్న ఓ పోలీసు మహిళపై కొందరు మహిళా ప్రయాణికులు దాడి చేయడంతో ఆమె గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీడియోలో, ఇద్దరు మహిళా ప్రయాణీకుల తలపై తీవ్ర రక్తస్రావం చూడవచ్చు. ఈ ఘటనపై జిఆర్‌పి దర్యాప్తు జరుపుతోందని, కేసు నమోదు చేసినట్లు కటారే తెలిపారు.
తుర్భే స్టేషన్‌లో ఒక సీటు ఖాళీ అయింది.. ఒక మహిళా ప్రయాణీకురాలు తనకు తెలిసిన మహిళను సీటులో కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. అదే సీటును మూడో మహిళ కూడా ఆ సీటుపై కూర్చోడానికి ప్రయత్నించింది. దీంతో ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అలా ఆ గొడవలో మరికొందరు ప్రయాణీకులు కూడా భాగమయ్యారు.


Tags:    

Similar News