అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం
సాయికృష్ణ (26) అనే యువకుడు కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమంది ఫైనాన్సర్ల వద్ద అప్పు తీసుకున్నాడు. కరోనా సమయంలో..
హైదరాబాద్ : అవసరం.. ఎవరిచేతనైనా అప్పులు చేయిస్తుంది. కానీ.. చేసిన అప్పు తిరిగి తీర్చలేకపోతే ప్రాణం తీసుకునేంత వరకూ తీసుకెళ్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది చేసిన అప్పులు తీర్చలేక.. వ్యక్తి గతంగా, కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అలాంటి ఘటనే జరిగింది, చేసిన అప్పులు తీర్చలేక, ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సాయికృష్ణ (26) అనే యువకుడు కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమంది ఫైనాన్సర్ల వద్ద అప్పు తీసుకున్నాడు. కరోనా సమయంలో ఆ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్లు సాయికృష్ణ పనిచేస్తున్న షాపు వద్దకు వెళ్లి అతని హెండా యాక్టివాను తీసుకెళ్లిపోయారు. తర్వాత డబ్బులు చెల్లిస్తాం.. వదిలేయాలని అతని తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా ఫైనాన్సర్లు వినలేదు. ఇప్పుడు కట్టాల్సిందేనని గట్టిగా చెప్పడంతో.. ఎవరినైనా అడిగి డబ్బులు కడదామని సాయికృష్ణ తల్లి బయటకు వెళ్లింది. తమకు జరిగిన అవమానాన్ని భరించలేక సాయికృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read : రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకుకు?
బయటకు వెళ్లిన తల్లి తిరిగి వచ్చేసరికి సాయికృష్ణ విగత జీవిగా కనిపించడంతో.. ఆమె గుండెలవిసేలా రోధించింది. ఫైనాన్సర్ల వల్లే తన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ సాయికృష్ణ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. ఆన్ లైన్ లో తక్కువ వడ్డీ రుణాలిస్తామని ఆశ చూపించి, తీరా రుణం తీసుకున్నాక వాళ్లను వేధించడం మొదలుపెడుతున్నారు. వారి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న బంధువులు, స్నేహితులకు మెసేజ్ లు పంపి పరువు తీస్తుండటంతో భరించలేని బాధితులు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.