అప్పుడే ‌ఓటమి డిసైడైందట

తెలుగుదేశం పార్టీలో పెద్ద తలకాయలు అని అంతా అనుకుంటున్న వారు. మాజీ మంత్రులుగా ఉన్న వారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉంటూ జనంతో మమేకం అయిన వారు. [more]

Update: 2019-08-14 05:00 GMT

తెలుగుదేశం పార్టీలో పెద్ద తలకాయలు అని అంతా అనుకుంటున్న వారు. మాజీ మంత్రులుగా ఉన్న వారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉంటూ జనంతో మమేకం అయిన వారు. వారే చింతకాయల అయ్యన్నపాత్రుడు. కింజరపు అచ్చెన్నాయుడు. ఇద్దరు టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యులు. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు చంద్రబాబు అనేక అవకాశాలు ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా విశాఖ జిల్లాలో అయ్యన్న, శ్రీకాకుళంలో అచ్చెన్న మాట ప్రకారమే అంతా జరిగేది. అలా తాము కోరుకున్నట్లుగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన ఈ ఇద్దరు సీనియర్లు ఇపుడు ఒకటే బాధపడుతున్నారు. టీడీపీ ఓడిపోవడం ఏంటి అని ఒక నేత అంటే, టీడీపీ ఎప్పటికీ అధికారంలోనే ఉంటుందని, ఓటమి గాలి కూడా తమ పార్టీకి సోకదని అనుకున్నాన‌ని మరో నేత అంటున్నారు. ఇక అయ్యన్న అయితే బోరున ఏడ్చేశారని వార్తలు కూడా వచ్చాయి.

చంద్రబాబు కంటే దగ్గరగా…..

చంద్రబాబు ముఖ్యమంత్రి, పైగా పార్టీకి అధినేత. అనేక వ్యాపకాల్లో పడి ఆయనకు జనం నాడి సరిగ్గా అందకపోవచ్చు. మరి జిల్లాకో మంత్రిని నియమించి పాలన చేయమని చెప్పాక పార్టీ స్థితిగతులు మంత్రులకైనా తెలియాలి కదా. నిత్యం ప్రజలలో ఉంటామని చెప్పుకునే ఈ మాజీ మంత్రులు ఇద్దరు ఇపుడు పార్టీ ఎందుకు ఓడిపోయింది అని అధినేతనే అడిగితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని. అసలు పార్టీలో జరుగుతున్న సంగతులన్నీ సీనియర్లు ఏనాడైనా అధినేత ముందు పెట్టారా. ప్రజలలో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం వద్ద వెళ్లగక్కారా అన్నది ఇపుడు అందరికీ కలుగుతున్న సందేహం. అయ్యన్న, అచ్చెన్న అమాయకత్వమే నిజమే అయితే వారిద్దరూ జనం వద్దకు పోలేదని అనుకోవాలి. లేకపోతే తమకు తెలిసిన నిజాలను అధినేతకు వివరించలేకపోయి అయినా ఉండాలి. అంతా అయ్యాక, పార్టీ పుట్టె మునిగాక ఇపుడు తాపీగా కూర్చుని ఎందుకు ఓడిపోయామని అధినేతతో గొంతు కలిపితే అది ఆత్మ వంచన తప్ప మరోటి కాదని తమ్ముళ్లు అంటున్నారు.

ఆధిపత్యం నిజం కాదా….

జిలాల్లో తామే సామంతరాజులమన్న తీరులో అచ్చెన్న, అయ్యన్న టీడీపీ పాలన సాగించారన్నది తమ్ముళ్ళే చెబుతారు. విశాఖ జిల్లాలో కనీసం నామినేటెడ్ పదవులు అయినా పదేళ్ళుగా పొరాడి అలసిన తమ్ముళ్ళకు ఇప్పించే బాధ్యతను అయ్యన్న తీసుకున్నారా అని నిలదీస్తున్నారు. పార్టీకి పనిచేసిన వారికి గుర్తింపు లేనపుడు క్యాడర్ ఎందుకు పనిచేస్తుందన్న సంగతి ఈ సీనియర్లకు తెలియదు అనుకోగలమా అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రూపు రాజకీయలను అచ్చెన్న రెచ్చగొడితే విశాఖ జిల్లాలో గంటాతో ఎందాకైనా అన్నట్లుగా అయ్యన్న వ్యవహరించిన సంగతి జనం మాటేమో గానీ పార్టీలోని వారు ఎవరూ ఇప్పటికీ మరచిపోలేదు. పార్టీని గాడిలో పెట్టాల్సిన సీనియర్లు కాడివదిలేసినపుడే టీడీపీ ఓటమి డిసైడ్ అయిపోయింది. మరిపుడు వగచి లాభం ఏమి ఉంటుందన్నది వారికే తెలియాలి అంటున్నారు. ఏది ఏమైనా సీనియర్లు ఇలా డీలాపడితే బాబు గారి సంగతి ఎవరికి చెప్పుకోవాలో కదా..

Tags:    

Similar News