సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూస్, లైక్స్ కోసమే వీడియోలా? కనీసం అవగాహన లేదా?

ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు

Update: 2024-08-26 04:39 GMT

కోల్‌కతాలోని ఆర్‌ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్, ఫెసిలిటీ సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పటికే బాధితురాలు అప్పటికే చనిపోయిందని లై డిటెక్టర్ పరీక్షలో చెప్పడం సంచలనంగా మారింది. అత్యాచారం, హత్య కేసులో తాను నిర్దోషి అని పేర్కొన్న కొద్ది రోజుల తర్వాత సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. నేరం తర్వాత సంజయ్ రాయ్ అత్యాచారం, హత్య చేసినట్లు కోల్‌కతా పోలీసుల అంగీకరించాడనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనను ఇరికించారని, నిర్దోషినని చెబుతూ వస్తున్నాడు. ఆగస్ట్ 9 తెల్లవారుజామున 4.03 గంటలకు సంజయ్ రాయ్ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడాన్ని పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో చూశారు. నేరస్థలంలో అతని బ్లూటూత్ హెడ్‌సెట్‌ను కూడా కనుగొన్నారు.


ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఆమెపై రాక్షసంగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆమె అత్యాచారం వెనుక ఒక్కడే కాదు.. మరెంతో మంది ఉన్నారని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ట్రైనీ డాక్టర్ గా నటిస్తూ పలు వీడియోలను పోస్టు చేశారు. కొందరు ఈ ఘటన గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించగా.. మరికొందరు లైక్స్, రీచ్ కోసం ఇలాంటి పనులు చేయడం దురదృష్టకరం. చాలా మంది నిజంగానే ట్రైనీ డాక్టర్ కు సంబంధించిన వీడియో అని నమ్మేశారు.

ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిరసనలు అనేక రాష్ట్రాలకు వ్యాపించాయి. వైద్య విద్యార్థులకు మద్దతు ఇచ్చారు.. సరైన సదుపాయాలను కల్పించాలని కోరారు. నిందితులపై కఠినమైన చర్యలను డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనుక కుట్ర సిద్ధాంతాలు, వైరల్ గ్రాఫిక్స్, ట్రెండింగ్ రీల్స్, తప్పుడు సమాచారం వ్యాప్తి ఊహించిన దానికంటే ఎక్కువ వైరల్ గా మారింది.

డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన ఐదు వీడియోలను యూట్యూబ్‌లో 64,000 మంది ఫాలోవర్లు ఉన్న 21 ఏళ్ల ట్వింకిల్ గులియా గత నాలుగు రోజుల్లో పోస్ట్ చేసింది. వీటన్నింటిలో, గులియా ల్యాబ్ కోటు ధరించి మెడలో స్టెతస్కోప్‌ని ధరించి.. బాధితురాలిగా ఆ వీడియోలలో నటించింది. కొందరు బాధితురాలేమోనని నమ్మేశారు. విపరీతంగా షేర్లు చేశారు. ఈ సంఘటన వల్ల నా తల్లి ఎక్కువగా ప్రభావితమైందని యూట్యూబర్ గులియా చెబుతోంది. ఢిల్లీలో మూడవ సంవత్సరం నర్సింగ్ విద్యార్థిని అయిన గులియా మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వరకు ఈ ఘోరం గురించి ప్రజలు తప్పకుండా మాట్లాడాలని గులియా తెలిపారు. బాధితురాలి పేరుతో సహా కేసుకు సంబంధించిన అన్ని ట్రెండింగ్ కీ వర్డ్స్ ను కలిగి ఉన్న గులియా వీడియోలు YouTube Shortsలో మిలియన్ వ్యూస్ ను పొందుతాయి.

లైంగిక వేధింపుల బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారి పేర్లను ప్రచురించడం, బహిర్గతం చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరం. బాధితురాలి పేరు, ఆమె మృతదేహం చిత్రాలు, దారుణ సంఘటనకు ముందు ఆమె ఫోటోలు X, Instagram, YouTube, Facebookతో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్, ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఫోటోల వ్యాప్తిని అరికట్టడం కష్టమేనని తెలుస్తోంది.

పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మేకప్ ఆర్టిస్టులు కూడా బాధితురాలి లాగా నటిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బాధితురాలి శరీరంపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయో అలా మేకప్ వేసుకుని మరీ నటిస్తూ వీడియోలను పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో, బాధితురాలి పేరు కోసం సెర్చ్ చేసినా.. అనేక ఫలితాలు కనిపించాయి. ఆమె ఫోటో, పేరుతో రీల్స్, పోస్ట్‌లు చాలా ఉన్నాయి. కొన్ని వీడియోలలో ఆమె ఇంటి ఫోటోలు, ఆమె తల్లిదండ్రులు, ఆమె వ్యక్తిగత Instagram ఖాతా నుండి సేకరించిన చిత్రాలు కూడా ఉన్నాయి. Google Trendsలో సెర్చ్ చేస్తే, 9 ఆగస్టు 2024 నుండి బాధితురాలి అసలు పేరు YouTubeలో అత్యంత జనాదరణ పొందిన కీవర్డ్ సెర్చ్ అని చూపిస్తుంది. వినియోగదారులు బాధితురాలి ఫోటోల కోసం వెతుకుతున్నారు, అలాగే ఆమె మృతదేహం గురించి కూడా ఎంతగానో వెతికారు.

వైద్యురాలిపై అత్యాచారం, హత్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వైరల్ కంటెంట్ చేయడానికి ఒక మార్గంగా మారింది. ఆమె పేరును బహిర్గతం చేసినందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా వినియోగదారులకు 280కి పైగా నోటీసులు జారీ చేసినప్పటికీ.. కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు.

*లైంగిక వేధింపుల బాధితురాలి పేరును బహిర్గతం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరం. వైరల్ రీల్స్, పోస్ట్‌లలో బాధితురాలి పేరును బయట పెట్టారు.. అలాగే బాధితురాలి చిత్రాలకు ఎలాంటి బ్లర్ వేయకుండా పోస్ట్ చేశారు. ఇలాంటివి చేయడం వలన శిక్షలు తప్పవు*


Tags:    

Similar News