Vijayawada : బెజవాడ మునకకు అసలు కారణమిదేనట.. నిపుణుల మాట

విజయవాడ వరదకు అసలు కారణం భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్దీకరణ చేయకపోవడమే

Update: 2024-09-03 07:45 GMT

విజయవాడను ముంచెత్తిన వరదకు అసలు కారణం భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే, అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్దీకరణ చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం. కొల్లేరు ను కబ్జా చేసి చేపలు, రొయ్యలు చెరువులు చేశారు, అందులోకి వరద నీళ్ళు వేగంగా వెళ్ళే పరిస్థితి లేదు. విజయవాడ మీదుగా 150 కిలో మీటర్ల దిగువకు బుడమేరు ప్రవాహం వేగంగా ప్రవహించే అవకాశం లేదు. దిగువకు వరద వెళ్ళే పరిస్థితి లేకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. 2005-06లో బుడమేరు వరదల తర్వాత బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడి కాలవలోకి మళ్లించారు.అయితే కృష్ణా నదిలో వరద ఉంటే బుడమేరు నీరు నదిలోకి వెళ్లదు. దిగువున విజయవాడ మీదుగా 150- 170.కి.మీ ప్రయాణించి కొల్లేరులో కలవాలి.

చుట్టూ ఆక్రమణలే...
బుడమేరు చుట్టూ ఆక్రమణలు, కొల్లేరు ముఖ ద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడను ముంచేశాయి. ఈ చెరువుల రాజకీయంలో అన్ని పార్టీలకు సంబంధం ఉంది. 28, 29 తేదీల్లోనే విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్రం నుంచి అలెర్ట్ ఉన్నా అందుకు తగ్గట్టుగా యంత్రాంగం రెడీ కాలేదు. వరద తగ్గుముఖం పట్టాలి అంటే మరి కొద్ది గంటలు పట్టొచ్చు. నీరు, ఆహారం, విద్యుత్ లేక విజయవాడలో సగం నగరం ఇబ్బంది పడుతోంది. వరద ప్రవాహం దిగువకు వెళ్ళే మార్గం లేకపోతే ముంపు తగ్గడానికి రోజుల సమయం పట్టొచ్చు. విజయవాడలో ముంపుకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే. ఇక్కడ ఇరిగేషన్ కట్టను తొలగించి ప్రజా ప్రతినిధులు నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. 2010 తర్వాత కొత్తగా వచ్చిన నివాస ప్రాంతాలు బుడమేరు క్యాచ్ మెంట్ ఏరియాలో ఉన్నాయి.
బుడమేరు సామర్థ్యం...
అక్కడ ఇళ్లు కట్టిన వారిలో చాలా మందికి అక్కడ బెజవాడ దుఖః దాయినిగా పేరొందిన బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలీదు. బుడమేరు గరిష్ఠ సామర్థ్యం వెలగలేరు వద్ద 6500 క్యూసెక్కుల మాత్రమే, వరదల్లో గరిష్ఠంగా 11,500 డిశ్చార్జి చేయగలదు. కానీ వరదల్లో అది 50-60 వేల క్యూసెక్కులను దాటి ప్రవహించిన చరిత్ర ఉంది. ఆ నీరు కృష్ణా నదిలోకి వెళ్ళాలి అంటే తక్కువ లోతు లో వెడల్పాటి కాల్వలు ఉండాలి. వీటీపీఎస్ ఉండటం వల్ల అక్కడ కాల్వ సామర్థ్యం పెంచే అవకాశం లేదు. భవిష్యత్తులో అయినా బుడమేరు ప్రవాహం కిందకు రావాల్సిందే. దానిని మలుపులు లేకుండా నేరుగా కాలువ తీర్చి దిద్దడం, కొల్లేరులోకి వరద వేగంగా వెళ్ళేలా చూడటం మాత్రమే శాశ్వత పరిష్కారాలు. అది ప్రభుత్వం చేయని వరకూ బెజవాడకు ఈ భారీ వర్షాలు కురిసినప్పడల్లా ఈ దుర్గతి తప్పదు.


Tags:    

Similar News