ఇంగ్లాండ్ దే అదృష్టం

బంతి బంతికి నరాలు తెగిపోయాయి. గెలుపు నీదా నాదా అని సాగింది ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ నడుమ సాగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. అదృష్టం రెండు [more]

Update: 2019-07-15 02:21 GMT

బంతి బంతికి నరాలు తెగిపోయాయి. గెలుపు నీదా నాదా అని సాగింది ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ నడుమ సాగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. అదృష్టం రెండు జట్ల మధ్య దోబూచులాడి చివరికి ఇంగ్లాండ్ పక్షానే నిలిచింది. దాంతో నాలుగున్నర దశాబ్దాల కలను సాకారం చేసుకుంది ఇంగ్లిష్ టీం. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ ఫైనల్స్ ఒక ఎత్తయితే తాజాగా లార్డ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్స్ లోనే హైలెట్ గా నిలిచి క్రికెట్ అభిమానులను ఆధ్యంతం అలరించింది. ఫైనల్స్ లో ఇరు జట్లు సమాన స్కోర్ సాధించడం తో సూపర్ ఓవర్ నిర్వహించడం అందులోను ఇరు జట్లు సమంగా పరుగులు చేయడం బౌండరీలు అత్యధికంగా సాధించిన ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం కివీస్ రన్నర్ గా నిలవడం ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా చేసింది.

టాస్ గెలిచినా ….

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు సాధించింది. ఓపెనర్ నికోలస్ 55 (77), టామ్ లాతమ్ 47 (56) కెప్టెన్ కెన్ విలియమ్సన్ 30 (53) పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ 242 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు, ప్లమ్కెట్ 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు ఆర్చర్ 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.

స్టోక్స్ , బట్లర్ బాదుడుతో ….

లక్ష్యం చిన్నదైనా పిచ్ బౌలర్లకు అనుకూలించడం న్యూజిలాండ్ అద్భుత బౌలింగ్ తో ఆచితూచి బ్యాటింగ్ మొదలు పెట్టింది ఇంగ్లాండ్. ఊహించిన విధంగానే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ వికెట్లను కివీస్ బౌలర్లు నేలకూల్చి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే బెన్ స్టోక్స్ 84 (98)నాటౌట్ , బట్లర్ 59 (60) బెయిర్ స్టో 36(55) వారి ప్రయత్నానికి అడ్డుగోడగా నిలబడి ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు దగ్గరకు చేర్చారు. కానీ చిట్టచివరి ఓవర్ లో ఒక బంతికి రెండు పరుగులు చేయాలిసిన దశలో ఇంగ్లాండ్ కేవలం ఒకే పరుగు చేసి చివరి వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దాంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ కు దారితీసింది. కివీస్ బౌలర్లలో నిషామ్ 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, ఫెర్గుసన్ 50 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, గ్రాండ్ హోమ్ ఒక వికెట్, హెన్రి ఒక వికెట్ నేలకూల్చారు.

సూపర్ ఓవర్ లో …

మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పనిసరైంది. ఇంగ్లాండ్ టీం లో సూపర్ ఫామ్ లో వున్న స్టోక్స్ , బట్లర్ లను బరిలోకి దింపింది. వీరిపై కివీస్ తన స్పీడ్ గన్ బౌల్ట్ ను ప్రయోగించింది. బౌల్ట్ ఆరుబంతుల్లో 15 పరుగులు సాధించారు. మ్యాచ్ గెలవాలంటే ఆరుబంతుల్లో 16 పరుగులను చేయాలిసిన కివీస్ హిట్టర్స్ నిషామ్ ఐదు బంతులు ఎదుర్కొని 13 పరుగులు, గుప్టిల్ ఒక బంతిని ఎదుర్కొని ఒక్క పరుగు సాధించగా ఆర్చర్ వేసిన వైడ్ తో కలిసి 15 పరుగులు చేసినా మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు సాధించడంతో కప్ ఇంగ్లాండ్ వశమైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.

44 ఏళ్ళ తరువాత ….

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టోక్స్ , మ్యాన్ ఆఫ్ ది సిరీస్ న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ దక్కించుకున్నారు. మోర్గాన్ సేన 44 ఏళ్ళతరువాత ఫైనల్ లో తమ సత్తా చాటి కప్ ను క్రికెట్ పుట్టిల్లుకు అందించింది. మూడుసార్లు గతంలో ఫైనల్ కి వెళ్ళినా కప్ సాధించని ఇంగ్లాండ్ నాలుగోసారి అదృష్టం తలుపు తట్టడంతో బాటు వత్తిడిలో అద్భుతంగా రాణించి సగర్వంగా కప్ అందుకుంది. వన్డే ప్రపంచకప్ టోర్నీ మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కప్ సాధించని ఇంగ్లాండ్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్ట్టించింది.

Tags:    

Similar News