మంత్రిగారి మౌనం వెనక..??

రాజ‌కీయాల్లో ఉన్న వారు పెద్ద ఎత్తున ప్రచారం కోరుకుంటారు. ఇక‌, ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా క‌నీసం 15 రోజుల‌కు ఒక‌సారైనా మీడియా ముందుకు వ‌చ్చి.. త‌మ [more]

Update: 2019-07-03 14:30 GMT

రాజ‌కీయాల్లో ఉన్న వారు పెద్ద ఎత్తున ప్రచారం కోరుకుంటారు. ఇక‌, ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా క‌నీసం 15 రోజుల‌కు ఒక‌సారైనా మీడియా ముందుకు వ‌చ్చి.. త‌మ వాయిస్ వినిపించి ప్రచారంలో ఉంటారు. ఇక‌, మంత్రుల విష‌యాన్ని ప్రత్యేకంగా చెప్పేదేముంది… ఎక్కడికి వెళ్లినా వెంట మీడియాను తీసుకు వెళ్తారు. మ‌రి అలా ప్రచారం కోరుకునే మంత్రుల జాబితాలో తాజాగా జ‌గ‌న్ కేబినెట్‌లోని ఓ మంత్రి మాత్రం ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చకు వ‌స్తోంది. జ‌గ‌న్ కేబినెట్‌లో అనూహ్యంగా బెర్త్ సంపాయించిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు.. తానేటి వ‌నిత‌.

ముఖ్యమైన శాఖ ఉన్నా….

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నుంచి తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం తానేటి వనిత సాధించారు. గ‌తంలో టీడీపీ నుంచి గెలిచిన ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంట‌నే ఎంతో మందిని కాద‌ని జ‌గ‌న్ దృష్టిలో ప‌డ్డారు. ఏకంగా కేబినెట్‌లో సీటు సంపాయించుకున్నారు. మ‌రీ ము ఖ్యంగా రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌ను చేప‌ట్టారు. గ‌తంలో ఇదే శాఖ‌ను నిర్వహించిన ప‌రిటాల సునీత నిత్యం మీడియాలో ఉండేవారు. ఏదో ఒక చోట స‌మీక్ష చేయ‌డం, ప‌రిశీల‌న చేయ‌డం, లేదా నిర్ణయాలు ప్రక‌టించ‌డం వంటి కార్యక్రమాల‌ను పెట్టుకుని ఆమె మీడియా దృష్టిని ఆక‌ర్షించేవారు. కానీ, ఇప్పుడు వ‌నిత మాత్రం ఎక్కడా ప్రచారాన్ని కోరుకోవ‌డం లేదు.

మీడియాకు దూరంగా…..

జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలోని చాలా మంది ప్రస్తుతం మీడియాలో ప‌దే ప‌దే క‌నిపిస్తున్నారు. వీరిలో బొత్స స‌త్యనారాయ‌ణ‌, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, అనిల్ కుమార్ యాద‌వ్, ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు ఏదో ఒక సంద‌ర్భంలో వారానికి రెండు మూడు సార్లు మీడియా ముందుకు వ‌స్తున్నారు. కానీ తానేటి వనిత మాత్రం ఇప్పటి వ‌ర‌కు మీడియా ముందుకు వ‌చ్చిన దాఖ‌లేలేవు. పోనీ.. మ‌హిళా మంత్రులు అంద‌రూ ఇలానే ఉన్నారా? అంటే అదీలేదు. హోం మంత్రి సుచ‌రిత‌, గిరిజ‌న శాఖా మంత్రి, ఉప ముఖ్యమంత్రి పుష్ఫ శ్రీవాణి వంటివారు వారానికి రెండు సార్లు మీడియాతో ట‌చ్‌లో ఉంటున్నారు. మ‌రి వ‌నిత ఎందుక‌ని మీడియాకు దూరంగా ఉంటున్నార‌నేది ప్రధాన ప్రశ్న.

ఆటోమేటిక్ గా వస్తుందని….

అయితే, సీఎం జ‌గ‌న్ మాదిరిగా తానేటి వనిత కూడా ప్రచారాన్ని కోరుకోవ‌డం లేద‌ని, ప‌ని చేస్తే.. ఆటోమేటిక్‌గా ప్రచారం వ‌స్తుంద‌ని, కేవ‌లం మాట‌లు చెప్పడం ద్వారా ప్రచారం చేసుకుంటే.. వృథా యేన‌ని ఆమె భావిస్తున్నట్టు కొంద‌రు చెబుతున్నారు.రాష్ట్రంలోని అన్ని వైద్య శాల‌ల్లోనూ మ‌హిళ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్యలు మెరుగు ప‌డేలా చూస్తున్నారు. అంగ‌న్ వాడీల జీతాల పెంపు వెనుక మంత్రి వ‌నిత హ‌స్తం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా అంగ‌న్‌వాడీల్లో అందించే భోజ‌నం నాణ్యంగా ఉండేలా ఆమె చ‌ర్యలు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. మొత్తానికి ఇంత చేస్తున్నా.. ఎక్కడా ప్రచారం కోరుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News