రెక్కల కష్టంతో గెలిచినా…?

పదేళ్ళ పోరాటం తరువాత ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయనకు అధికారం కష్టార్జితం. ఎవరి దయా ధర్మం కానే కాదు. తన రెక్కల కష్టంతోనే జగన్ ఓట్లూ, [more]

Update: 2019-07-26 02:00 GMT

పదేళ్ళ పోరాటం తరువాత ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయనకు అధికారం కష్టార్జితం. ఎవరి దయా ధర్మం కానే కాదు. తన రెక్కల కష్టంతోనే జగన్ ఓట్లూ, సీట్లు గెలుచుకున్నారు. పార్టీ పెట్టిన తరువాత అనేక ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా ఒంటి చేత్తో ఎదుర్కొన్నవాడు. ఆయన ఎపుడూ పొత్తుల కోసం వెంపర్లాడలేదు. లోపాయికారీ రాజకీయాలు, రాజీలు జగన్ కి అంతకంటే తెలియవన్నది అందరికీ అర్ధమైన విషయమే. అదే తెలిస్తే ఆయన కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వస్తారు. నానా బాధలు పడతారు. అందువల్ల జగన్ విజయం ఆయన స్వార్జితం. ఇందులో ఎవరు ఎన్ని చెప్పినా అది అసూయతో అంటున్న మాటలుగానే చూడాలి.

ఇరవై శాతం ఓట్లు మావే….

ఇంత నిబ్బరంగా అన్నది ఎవరో కాదు ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్. ఆయన జగన్ భారీ విజయం వెనక తమ పార్టీ పాత్ర ఉందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అదెలా అంటే ఏపీలో బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా టీడీపీ మళ్ళీ రాకూడదన్న ఆలోచనతో జగన్ కి పడ్డాయట. అలా తమ ఓట్లు 20 శాతం కలిస్తేనే జగన్ కి ఇన్ని సీట్లు, ఓట్లూ దక్కాయని సునీల్ అంటున్నారు. ఏపీలో చంద్రబాబు పాలన వద్దనుకున్న జనాలకు జగనే ప్రత్యామ్నాయం అయ్యారని ఆయన విశ్లేషిస్తున్నారు. అదే బీజేపీ పోటీగా ఉంటే తమకే జనం పట్టం కట్టేవారని కూడా అంటున్నారు. ఏపీలో జగన్ ని ఎంతలా తీసిపారేయగలమో అంతలా మాటలు తూలుతున్నారు కమలనాధులు. అదే నిజమైతే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు ఏకంగా కడప ఉప ఎన్నికలో ఆయనకు అయిదున్నర లక్షల ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఏపీలో జరిగిన 18 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ 15 సీట్లను గెలుచుకుంది. ఇక 2014 ఎన్నికల్లో కేవలం అయిందున్నర లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓడిపోయింది. మరి జగన్ కి బలం లేకపోతే ఇవన్నీ జరిగేవా అన్నది కూడా కమలనాధులు చెప్పాలి

పెనం నుంచి పొయ్యిలోకట….

మరో బీజేపీ నేత రాం మాధవ్ ఏపీలో వైసీపీ పాలన పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని అంటున్నారు. జగన్ అంటే జనం భయపడుతున్నారట. వైసీపీ ఏలుబడిలో మేలు కంటే కీడే ఎక్కువట. ఇవన్నీ బాగానే ఉన్నా అసలు జగన్ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయిందని ఇంతలేసి మాటలంటున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చేయాలన్న ఆరాటం బీజేపీకి ఎక్కువై ఇలా మాట్లాడిస్తుందనుకోవాలేమో. జగన్ మరీ అంత అర్బకుడిగా, దుర్బలుడిగా బీజేపీ నేతలకు ఎందుకు కనిపిస్తున్నాడో కానీ ఏపీలో పొలిటికల్ సీన్ వారు భావిస్తున్నట్లుగా అసలు లేదు. చంద్రబాబు ఓడిపోయారు కాబట్టి ఏపీ మాదే, జగన్ ని పక్కన పెట్టాల్సిందే. ఇదీ ఇపుడు కాషాయ పార్టీ కదన కుతూహలం. మొదట్లో 2029లో ఏపీలో అధికారం అన్నారు, నిన్నటి వరకూ 2024లో ఏపీలో గెలుస్తామని చెప్పారు. కర్ణాటకలో కూటమి కూలిపోయాక ఇపుడు ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటున్నారు. అంటే జగన్ ని అయిదేళ్ళూ తిన్నగా పాలన చేసుకోనివ్వరా ఏంటి. ఈ డౌటే ఇపుడు వైసీపీ నేతలను పట్టి పీడిస్తోంది.

Tags:    

Similar News