Haryana Assembly Elections 2024 : గుండెల్లో తెలియని గుబులు.. హర్యానా ఎన్నికల్లో అన్ని పార్టీలకు అదే ఫియర్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ జరుగుతుంది. అన్ని పార్టీలు పోటీ ఉండటంతో గెలుపు పై అంచనాలు కష్టంగా మారాయి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ జరుగుతుంది. అనేకపార్టీలకు చెందిన అభ్యర్థులు ఈసారి బరిలో ఉండటంతో గెలుపు పై అంచనాలు కష్టంగా మారాయి. 2014 పార్లమెంటు ఎన్నికల్లో హర్యానాలో ఉన్న పది పార్లమెంటు స్థానాలను బీజేపీకి దక్కించుకుంది. అయితే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు బలాబలాలు సమానంగా ఉన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత పోలింగ్ జరగనుండటంతో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలైన జేజేపీ, ఐఎన్ఎల్‌డీలు కూడా ఎన్నికల బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఎవరి ఓట్లకు ...?
ఆమ్ ఆద్మీ పార్టీ, జేజేపీ, ఐఎన్ఎల్‌డీలు ఎవరి ఓట్లకు గండి కొడతాయన్న టెన్షన్ నెలకొంది. భారతీయ జనతా పార్టీ పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను మూడు పార్టీలూ చీల్చుకుంటాయని, ఫలితంగా తమ గెలుపునకు అవకాశం ఏర్పడుతుందని కమలనాధుల అంచనాగా ఉంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉండటం కూడా తమకు కలసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తుంది. అదే సమయంలో హర్యానాలో ఉన్న ప్రధాన వర్గాలన్నీ బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నాయని, అది తమకు లాభిస్తుందన్న కాంగ్రెస్ గట్టిగా విశ్వసిస్తుంది. ఇందుకు గత లోక్‌సభలో ప్రజలు చూపిన ఆదరణే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. హర్యానా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ భావిస్తుంది.
హంగ్ ఏర్పడితే..?
కానీ గుండెల్లో తెలియని గుబులు. ప్రజల మూడ్ ను అంచనా వేయలేని పరిస్థితి. కాంగ్రెస్ గత లోక్‌సభ ఎన్నికల్లో మంచి స్థానాలను సాధించి ఊపు మీదుంది. ఎందుకంటే ప్రజల్లో మోదీ సర్కార్ పై వ్యతిరేకత పెరిగిందని భావిస్తుంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పాలన పట్ల విశ్వసనీయత తక్కువగా ఉందని బీజేపీకి అందుతున్న ఫీడ్ బ్యాక్ ద్వారా అర్థమవుతుందంటున్నారు. హర్యానా ప్రజలు తెలివైన వారని, వారి తీర్పు స్పష్టంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, జేజేపీ, ఐఎన్ఎల్‌డీలు రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లపై వ్యతిరేకత తమకు కలసి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తాము కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద హర్యానా ఎన్నికలు ఫలితాలు తేలేంత వరకూ ఎవరిది విజయమన్నది తేల్చలేని పరిస్థితి.