Haryana Assembly Elections 2024 : అన్ని పార్టీలకూ ఏదో ఒక టెన్షన్ ..గెలుపు పై మాత్రం గుంభనంగా?
హర్యానా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపుపై మౌనంగానే ఉన్నాయి. తమదే గెలుపు అన్న ధీమాను అన్ని పార్టీలూ ప్రదర్శిస్తున్నాయి
హర్యానా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపుపై మౌనంగానే ఉన్నాయి. బయటకు తమదే గెలుపు అన్న ధీమాను అన్ని పార్టీలూ ప్రదర్శిస్తున్నప్పటికీ భయం మాత్రం అన్ని పార్టీలనూ వెంటాడుతూనే ఉంది. ఒంటరిపోరుకు సిద్ధమయిన అన్ని పార్టీల్లో గెలుపు అంచనాలు ఎవరికీ అందకుండా ఉన్నాయి. కానీ జనం మూడ్ ఎలా ఉందన్నది మాత్రం ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి. గెలుపు పై ఎవరికి స్పష్టత లేకపోయినప్పటికీ తమ ప్రయత్నాలను మాత్రం చివరి వరకూ చేయాల్సిందేగా. అందుకే ఎవరి స్ట్రాటజీతో వారు ఎన్నికలకు వెళుతున్నారు. అయితే చివకు ఎవరి ఎన్నికల వ్యూహం పనిచేస్తుందన్న దానిపైనే గెలుపు ఆధారపడి ఉంటుందన్న విశ్లేషణలు హర్యానా ఎన్నికల్లో వెలువడుతున్నాయి.
కాంగ్రెస్ పరిస్థితి....
కాంగ్రెస్ గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి కొంత ఊపు మీదున్నప్పటికీ ఆ పార్టీకి అనేక అవరోధాలున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలను పార్టీలోకి చేర్చుకుంది. ప్రధాన సామాజికవర్గమైన జాట్లుఈసారి తమకు అనుకూలంగా ఉంటుందని, అదే సమయంలో రెజ్లర్లకు జరిగిన అన్యాయంతో ప్రజలు తమ వైపు మొగ్గుచూపుతారని భావిస్తుంది. అయితే ఆమ్ ఆద్మీపార్టీ విడిగా పోటీ చేస్తుండటంతో పాటు నాయకత్వ సమస్య కూడా కాంగ్రెస్ ను వెంటాడుతుంది. అనేకమంది అభ్యర్థుల ఎంపిక తర్వాత పార్టీలో కొంత అసంతృప్తులు పెరిగాయి. ఇతర పార్టీలలో చేరిపోవడంతో తాము బలహీనంగా మారామా? అన్న ప్రశ్న కాంగ్రెస్ ను వెంటాడుతుంది.
బీజేపీకి కూడా...
అదే సమయంలో బీజేపీకి కూడా అంత సానుకూల వాతావరణం లేదు. అభ్యర్థుల ప్రకటనల తర్వాత నేతల్లో అసంతృప్తి పెరిగింది. మంత్రుల నుంచి ముఖ్యమైన నేతలు పార్టీని వదిలి వెళ్లారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం కూడా సొంత పార్టీ క్యాడర్ లో అగ్గి రాజేసింది. జాట్లు తమకు ప్రతికూలమని భావించిన బీజేపీ కేంద్ర నాయకత్వం దానికి విరుగుడుగా వెనుకబడిన కులాలను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాన్ని రచించింది. అందుకేు ఓబీసీకి చెందిన నయబ్ సైనీని ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా తిరిగి అధికారంలోకి వస్తే ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటించి పార్టీకి ఊపు తెచ్చింది. సైనీని ముందు పెట్టి ఎన్నికలకు వెళుతుండటంతో తమ గెలుపు గ్యారంటీ అనుకుంటోంది. మరో వైపు పార్టీని దెబ్బతీసే అనేక అంశాలు కూడా భయపెడుతున్నాయి. మొత్తం మీద గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్న తరహాలో హర్యానా రాజకీయాలు కొనసాగుతున్నాయి.