Jammu, Haryana Elections : బీజేపీలో అంతర్మధనం జరిగేనా? తప్పులు సరిదిద్దుకుంటారా?
జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చేటట్లు కనపడుతున్నాయి
జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చేటట్లు కనపడుతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్న ఈ ఎన్నికల్లో పరాభవం తప్పేట్లు లేదు. మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా ఫలితం కనిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పేట్లు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతుందని చెప్పినా ప్రజలు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.
లోక్‌సభ ఎన్నికల్లోనే...
మొన్నటి ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ దారుణమైన దెబ్బతినింది. నాలుగు వందల స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలకు వెళితే కనీసం 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్నది సాధించలేకపోయింది. కేంద్రంలో అధికారంలో పదేళ్లుగా ఉన్న బీజేపీపై కొంత వ్యతిరేకత స్పష్టంగా కనపడింది. అయితే ఎన్డీఏ కూటమితో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ కనుక ఆదుకోకుంటే మోదీ సర్కార్ కు మొన్నటి ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయేది. అత్యధిక స్థానాలను సాధించిన పార్టీగా బీజేపీ గత ఎన్నికల్లో అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయలేకపోయింది.
పదేళ్ల నుంచి...
కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల నుంచి తీసుకున్న నిర్ణయాలతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనే ఇండియా కూటమి కొంత పుంజుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి ఏర్పడితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద దెబ్బే అవుతుంది. రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలు బీజేపీకి కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా నిత్యావసరాల ధరలు పెరగడం కూడా ఓటమికి కారణాలుగా చెబుతున్నారు. ప్రజాభిప్రాయం కాకుండా ఏకపక్ష నిర్ణయాలు కూడా పార్టీని ఇబ్బంది పెట్టాయంటున్నారు కొందరు పార్టీ నేతలు. మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ సర్కార్ నిర్ణయాల్లో మార్పులు తీసుకునే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.