హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తాం
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శంషాబాద్ లో రెండో రన్ వే కూడా వస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే హైదరాబాదీలకు మరింత సౌకర్యాలను మెరుగుపర్చేందుకు మెట్రో రైలును విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నా, లేకున్నా మెట్రో రైలును ఏర్పాటు చేసుకుందామన్నారు. ఎంత ఖర్చు చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనకాడదని కేసీఆర్ అన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలను పెంచుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్ ను అంచనా వేసుకుని మున్సిపల్ శాఖ వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకారం అందిస్తుందన్నారు.
సెకండ్ ఫేజ్ కు...
మెట్రో సెకండ్ ఫేజ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 6,250 కోట్లతో మెట్రో విస్తరణ పనులను చేపట్టనున్నారు. రాయదుర్గం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకునేలా ఈ మెట్రోఎక్స్‌ప్రెస్ వే ఉండనుంది. మొత్తం 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మెట్రో రైలు కేవలం 26 నిమిషాల్లోనే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. మొత్తం తొమ్మిది స్టేషన్లను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.
రాయదుర్గంలోనే చెక్ ఇన్...
రాయదుర్గం మెట్రో రైల్వే స్టేషన్ లో చెక్ ఇన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడే చెక్ ఇన్ అయి ప్రయాణికులు నేరుగా విమానాశ్రయానికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. రెండున్నర కిలోమీట్లర్లు భూగర్భంలో నిర్మించనున్నారని మెట్రో వర్గాలు వెల్లడించాయి. కేవలం ప్రయాణికులు కూర్చునే విధంగానే మెట్రో రైలును డిజైన్ చేయనున్నారు. సాధారణ మెట్రో కంటే దీని వేగం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పారు.