Hydrabad Metro : తినాలన్నా కొనాలన్నా ఒకప్పుడు ఆబిడ్స్.. కానీ ఇప్పుడో?
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాతావరణంతో పాటు అనేక రకాల అంశాలు హైదరాబాద్ కోటి జనభా దాటడానికి దోహదపడుతున్నాయి. ఇక్కడ స్థిర నివాసం ఉండే వారితో పాటు హైదరాబాద్ కు ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఎక్కువ. 1990వ దశకంలో చూసిన హైదరాబాద్ నగరానికి ఇప్పటి నగరానికి అసలు పొంతనే లేదు. ఎక్కడకక్కడ నగరం విస్తరించింది. కార్పొరేట్ వ్యాపార సంస్థలు తమ శాఖలను ప్రతి చోటా తెరిచాయి. అన్ని చోట్ల వినియోగదారులతో దుకాణాలన్నీ కిటకిటలాడుతుండటంతో నగరం నలువైపులా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ కొనుగోళ్లు, అమ్మకాలు అక్కడే... ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి.
1990వ దశకంలో...
1990వ దశకం వరకూ షాపింగ్ చేయాలంటే ఆబిడ్స్ లేదా అమీర్ పేట్ కు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. వస్త్రాలయినా, బంగారాలయినా, షూ దుకాణాలయినా.. మెగా మార్ట్ లయినా ఒకటేమిటి అన్నీ ఈ రెండు ప్రాంతాలకే పరిమితమయ్యేవి. దీంతో ఆదివారాలు ఆబిడ్స్, అమీర్ పేట్ లలో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. ఇక భోజనం వండి వడ్డించే హోటళ్లు కూడా అన్ని రకాల రుచులు అందించేవి ఆ రెండు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు అలా కాదు. నగరం ఎక్కడ చూసినా శాఖలను హోటళ్లు కానీ, జ్యుయలరీ దుకాణాలు కానీ, వస్త్ర దుకాణాలు కానీ పెట్టేశాయి. దీంతో ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నారు. తమ ఇంటివద్దకే దుకాణాలు రావడంతో ప్రయాణ ఖర్చులతో పాటు అలసట కూడా తగ్గినట్లు నగరవాసులు ఫీలవుతున్నారు.
కొత్త పేట చూసుకుంటే...?
ఉదాహరణకు ఒకప్పుడు కొత్తపేట చూసుకుంటే అక్కడ ఏమీ దొరికేది కాదు. కానీ ఇప్పుడు కొత్తపేట సెంటర్ లో దొరకనిది ఏమీ ఉండదు. కూతవేటు దూరంలో దిల్ సుఖ్ నగర్ ఉన్నప్పటికీ అది కూడా దూరంగానే కొత్తపేటకు దగ్గరగా ఉంటున్నవారికి కనపడుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే రోడ్డుకు ఇరువైపులా కార్పొరేట్ సంస్థలు వెలిశాయి. ఇప్పుడు ఆబిడ్స్ మాట దేవుడెరుగు కొత్తపేట ప్రాంత ప్రజలు దిల్ సుఖ్ నగర్ కు కూడా వెళ్లకుండా అక్కడే కొనుగోలు చేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. మరోవైపు మెట్రో రైలు పడటం కూడా ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇలా కేవలం కొత్తపేట మాత్రమే కాదు.. నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఇలాగే జరిగింది. ఇలాగే నగరం విస్తరించింది. అందుకే మెట్రో రైలు మరింతగా విస్తరిస్తే నగరం మరింత వేగంగా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు.
రెండో దశ పూర్తయితే....
మెట్రో రైలు 2017లో పట్టాలెక్కింది. మొదట ఎల్బీనగర్ - మియాపూర్ మార్గం ఏర్పాటయింది. తర్వాత నాగోల్ నుంచి మాదాపూర్ వరకూ విస్తరించారు. అక్కడ పక్కనే ఉన్న అన్ని ప్రాంతాలు వేగంగా విస్తరించాయి. అభివృద్ధికి నోచుకున్నాయంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగరం మరికొద్ది రోజుల్లోనే మరింత విస్తరించే అవకాశముంది. ఎక్కువ మంది మెట్రో రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. రోజుకు ఆరు లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ ను మెరుగుపర్చితే.. సొంత వాహనాలను బయటకు తీయకపోతే ట్రాఫిక్ సమస్య కూడా కొద్దిగా తెరపడే ఛాన్స్ ఉంది.