భాగ్యనగరంలో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

శేరిలింగంపల్లి, చందానగర్,మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు,లోతట్టు..

Update: 2023-07-20 05:24 GMT

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు 48 గంటలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు చేరడంతో.. వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినా.. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది.

శేరిలింగంపల్లి, చందానగర్,మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు,లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాలలో రోడ్లు తవ్వి వదిలియ్యడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక ప్రజలు, వాహనదారులు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అండర్ పాస్ బ్రిడ్జి కింద భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లింగంపల్లి నుండి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, BHEL వెళ్లే వాహనదారులు మరో మార్గంవైపుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అండర్ పాస్ లో నుంచి వస్తున్న కారు వర్షపునీటిలో చిక్కుకుపోవడంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి కారును బయటికి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అండర్ పాస్ లో నిలిచిపోయిన నీటిని తోడే పనిలో ఉన్నారు.


Tags:    

Similar News